శర్వానంద్ ఈమధ్య చాలా లావైపోయాడు. `96`, రణరంగం సినమాల్లోని పాత్రల కోసం కొంచెం ఒళ్లు చేశాడు శర్వా. ఆ తరవాత… అదే కంటిన్యూ అయ్యింది. శ్రీకారం, ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాల్లో చాలా బొద్దుగా కనిపించాడు. ఇదే విషయం అడిగితే.. “నిజమే.. ఈ మధ్య బాగా లావయ్యాను. త్వరలోనే తగ్గాలి. నా తదుపరి సినిమాకి కొత్త లుక్‌లో కనిపిస్తా“ అని ఇది వరకే చెప్పేశాడు శర్వా. అన్నట్టే… ఆడవాళ్లు.. మీకు జోహార్లు తరవాత శర్వా కాస్త గ్యాప్ తీసుకొని ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాడు. దాదాపు 8 కిలోలు బరువు తగ్గాడు. ఇప్పుడు శర్వా.. మళ్లీ మునుపటి లుక్‌కి వచ్చేశాడు. శర్వా కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్ చూసి… శర్వా అభిమానులు ఊపిరి పీల్చుకొంటున్నారు. కథల ఎంపికలో శర్వా చాలా జాగ్రత్తగా ఉన్నా, ఈ మధ్య పరాజయాలు తగిలాయి. ఇప్పుడు మళ్లీ… కథలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. కాస్త గ్యాప్ వచ్చినా ఈసారి మంచి కథతోనే రావాలనుకుంటున్నాడు. అందుకే తదుపరి సినిమా విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు. త్వరలోనే శర్వా కొత్త సినిమా కబురు అందబోతోంది.