అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వసతి సదుపాయాన్ని రద్దు చేసింది. ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లను గురువారం ఖాళీ చేసివ్వాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను అప్పగించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే అప్పగించాలని… ఏమైనా నష్టం జరిగి ఉంటే సంబంధిత ఉద్యోగులే భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత అమరావతికి ఏపీ రాజధాని తరలించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల ఉచిత వసతి ఏర్పాటు చేశారు. వారికి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వసతి కల్పించారు. ప్రభుత్వమే వారి వసతి ఖర్చు భరిస్తూ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఉచిత వసతిని తీసేయాలని ప్రయత్నిస్తూ వస్తోంది. పలుమార్లు ఉత్తర్వులుజారీ చేసింది. అయితే ఉద్యోగ సంఘాల నేతల ఒత్తిడితో పొడిగిస్తూ వచ్చారు.
ఇక పొడిగింపు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులు అందరూ ఇక సొంత వసతి చూసుకోవాలి. పలువురు ఉద్యోగులు ఇప్పటికీ పిల్లల చదువులు….ఇతర అవసరాల కోసం హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఉద్యోగ సంఘాల నేతలటున్నారు. తాము పొడిగింపు తీసుకు వస్తామని సంఘాల నేతలు చెబుతూండటంతో ఉద్యోగులు కూడా వేరే ఏర్పాట్లు చేసుకోలేకపోయారు.