గడప గడపకూ వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని వైఎస్ఆర్సీపీ కి చెందిన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్లీనరీలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నవరత్నాలు అమలు చేయండ వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే పేరు వస్తోందన్నారు. ఎమ్మెల్యేలను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లు, డ్రైనేజీలు కావాలని అడుగుతున్నారని.. వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.
ఇటీవల సీఎం జగన్ తన గ్రాఫ్ బాగుందని.. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ కామెంట్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే కనీసం నాలుగు సీసీ రోడ్లు వెయ్యాలన్నారు. కార్యకర్తలను ఆదుకోవాలన్నారు. కార్యకర్తలకు పనులు ఇచ్చి వారిని అప్పుల పాలు చేశానని దర్శి ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో ఆనందం నింపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు
ఇదే ప్లీనరీకి హాజరైన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక పార్టీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లులు మంజూరు చేసి కార్యకర్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు ఆపకుండా చేస్తున్న సమయంలో కల్పించుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. సీఎం జగన్‌కు కొన్ని ప్రాధాన్యాలు ఉన్నాయని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని సర్ది చెప్పే యత్నం చేశారు.