గ్రామ, వార్డు సచివాలయ ప్రొబేషన్ల వ్యవహారాన్ని గందరగోళం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పరీక్షలు పేరుతో… ఓటీఎస్ సొమ్ముల పేరుతో సగం మందికి ప్రొబేషన్ కు అనర్హుల్ని చేసేసిన ప్రభుత్వం ఇప్పుడు అసలు ప్రొబేషన్ ఎవరు ఇవ్వాలన్నదానిపై లింకులు పెడుతోంది. జిల్లాల విభజన జరిగింది. ఇప్పుడు కొత్త జిల్లాలకు కలెక్టర్లు వచ్చారు. జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ తాజాగామరోసారి ఆదేశాల్ని సవరించింది. పాత జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేయాలని ఆదేశించింది.
అసలు పాత జిల్లాలు పూర్తిగా ఉనికి కోల్పోయిన తర్వాత ఇప్పుడు పాత జిల్లాల కలెక్టర్లకు అధికారం ఎలా ఉంటుందో ప్రభుత్వానికే తెలియాలి. వారు ప్రొబేషన్ ఖరారు చేస్తే. . ఎలా చట్టపరంగా సాధ్యమో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. అసలు కొత్త జిల్లాల ఉనికి వచ్చినప్పుడు .. పాత జిల్లాల ఉనికి లేనప్పుడు… ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక మతలబేంటో మాత్రం ఎవరికీ అంతు చిక్కదు. అయితే కొత్త జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే అనేక రకమైన చట్టపరమైన సమస్యలు వస్తాయని అందుకే పాత జిల్లాల వారీగా ప్రొబేషన్ ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ ముందుగా ఆలోచించవద్దా.. చివరి క్షణంలో ఇలా చేస్తారా అన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
పీఆర్సీ చర్చల సమయంలో జూన్లో ప్రొబేషన్ ఖరారు చేసి జూలై ఒకటో తేదీనుంచి రెగ్యులర్ పే స్కేల్ జీతం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ప్రొబేషన్ ఖరారు కాకపోవడంతో జూలై ఒకటో తేదీన పాత జీతమే అంటే పదిహేను వేలు మాత్రమే అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంతో అసలు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రొబేషన్ చేసే ఉద్దేశం లేదని.. వారిని అలా వివాదాల్లో ఉంచే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం వారిలో ప్రారంభమయింది.