ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేతకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. ప్రధాని మోదీ భీమవరంలో పాల్గొంటున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధిని పంపాలని కోరారు. ఈ మేరకు అధికారికంగా లేఖ కూడా పంపారు. ఈ అంశంపై పార్టీలో చర్చించిన చంద్రబాబు … ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు మోదీ కార్యక్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించారు. ముఖ్య మంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. ఇక జనసేన పార్టీ అధినేతను పిలుస్తారా లేదాఅన్నదానిపై క్లారిటీ లేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం జనసేనకు మైనస్‌గా మారింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలో చేరిపోయారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు సంబంధం లేదని చెబుతున్నారు.
అందుకే ఈ కార్యక్రమానికి ప్రజాప్రాతనిధ్యం ఉన్న అన్ని పార్టీలకూ ఆహ్వానం పంపుతున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయాలకు అతీతంగా… స్వతంత్రం కోసం పోరాడిన వారిని గౌరవించుకోవడం కోసమే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జనసేన పార్టీకి ఆహ్వానం ఉండకపోచవ్చని అంటున్నారు. రాజకీయాల్లో లేని కారణంగా కళా రంగం నుంచి ప్రముఖుడిగా చిరంజీవికి ఆహ్వానం పంపారని అంటున్నారు. అయితే రాజకీయాలకు సంబంధం లేదన్నా.. రాజకీయాలు కలిపేసుకోవడం ఏపీ స్పెషల్ కాబట్టి.. చర్చ మాత్రం జరుగుతుంది.