న్యాయవ్యవస్థను బండ బూతులు తిట్టి ఇప్పుడు తనను కాపాడాలని అదే వ్యవస్థ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లారు వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్. సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అలాగే.. సీబీఐ తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంతకీ సీబీఐ ఆయనను అరెస్ట్ చేయాలనుకున్న కేసేమిటంటే.. న్యాయవ్యవస్థను దూషించిన కేసే. డాక్టర్ సుధాకర్ కే్సు సీబీఐకి ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోగానే.. చెలరేగిపోయిన వైసీపీ కార్యకర్తలు.. నేతల్లో ఆయన కూడా ఒకరు. చీరాలలో ర్యాలీ నిర్వహించి మరీ హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీర్పును ఖండించారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించారు.
ఈ అంశంపై కేసు నమోదయింది. ఈ కేసును కూడా సీఐడీ పట్టించుకోకపోతూండటంతో హైకోర్టు సీబీఐకి ఇచ్చింది. ఆ కేసులో ఆమంచితో పాటు మరో వంద మంది ఉన్నారు. వీరిలో కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా ఆమంచిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే విచారణకు పిలుస్తూంటే ఆమంచి వెళ్లడం లేదు. రెండు సార్లు నోటీసులు జారీ చేస్తే కారణాలుచెప్పి తప్పించుకుని ఇప్పుడు… హైకోర్టును ఆశ్రయించారు. ఆమంచి తరపున ఇటీవలే రాజ్యసభకు ఎంపికయిన జగన్ అక్రమాస్తుల కేసుల లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు.
ఆమంచి అసలు కోర్టుల్ని.. న్యాయమూర్తుల్ని ఏమీ అనలేదని ఆయన వాదించారు. అయితే సీబీఐ మాత్రం తదుపరి విచారణలో చర్యలుంటాయని స్పష్టం చేసింది. సీబీఐ చర్యల విషయంలో ఎలాంటి స్టే ఇవ్వని హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విధి విచిత్రం అంటే ఇదేనని… ఏ వ్యవస్థను తిట్టారో అదే వ్యవస్థ దగ్గరకు రక్షణ కోసం వెళ్లారని సెటైర్లు వినిపిస్తున్నాయి.