శివసేనను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కొంత కాలం మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని వదులుకోవడానికి కూడా బీజేపీ సిద్ధపడింది. మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండేతో ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. ఆయనకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వనుంది. ఆయన కేబినెట్లో బీజేపీ ఎమ్మెల్యేలు చేరుతారా లేదా అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతానికి షిండే ముఖ్యమంత్రి అవుతారు. మాజీ సీఎం ఫడ్నవీస్ మాత్రం ప్రభుత్వంలో భాగం కావడం లేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక శివసేన పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే వ్యూహం దాగి ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో హిందూత్వ ట్యాగ్‌తో రాజకీయాల్లో ఉన్న శివసేన బలంగా ఉన్నంత కాలం.. బీజేపీ ఒంటరిగా అధికారం చేపట్టడం సాధ్యం కాదు. ఆ వ్యూహంతోనే శివసేన నుంచి చీలి వచ్చిన ఏక్ నాథ్ షిండేను సీఎంను చేసి.. చీలిక వర్గంగా గుర్తింపు ఇస్తే..ఆ పార్టీ పని అయిపోతుందని నమ్ముతున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండటంతో ధాకరే పార్టీపై పట్టు కోల్పోయినట్లయింది. అయితే కింది స్థాయి క్యాడర్ ఇప్పుడు ఎటు వైపు ఉంటారన్నది కీలకంగా మారింది.
బీజేపీ పన్నిన ఈ వ్యూహం గురించి ఏక్ నాథ్ షిండే కు.. ఆయన వర్గానికి తెలియదని అనుకోలేంకానీ…. శివసేన నిర్వీర్యం అయిపోయిందనుకున్న మరుక్షణం వారు బీజేపీలో చేరిపోయే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ ను ఇప్పటి వరకూ బీజేపీతో కలిసి ఏక్ నాథ్ పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. అయితే ప్రజలు ఎలా అనుకుంటారో.. ఎలా స్పందిస్తారో తేలిన తర్వాత వీరి వ్యూహం ఎంత వరకూ అమలవుతుందో స్పష్టమవుతుంది.