టాలీవుడ్ కలెక్షన్స్ మొత్తం తన ఖాతాలో వేసుకుని .. వారిని గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలికంగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు నుంచే ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మాలనుకున్నా.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమా టికెట్ల కొత్త విధానం అమలు నిలిపేసిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.
సినిమాల టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు సవరణ చట్టం చేసి, ప్రభుత్వం టికెట్ల విక్రయాలపై ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎగ్జిబిటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ లోపు ప్రభుత్వం.. ఇతర వెబ్ సైట్లలో కూడా టిక్కెట్లు కొనవచ్చని .. యువర్ స్క్రీన్స్ పేరుతో సొంత గేట్ వెట్ ఉంటుందని ప్రకటించింది. అయితేఇతర కంపెనీలుూ.. యువర్ స్క్రీన్స్ ద్వారానే టిక్కెట్లు అమ్మాలని నిర్దేశించింది. ఈ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
ప్రస్తుతానికి కొత్త విధానం ప్రకారం ఏపీ సర్కార్ టికెట్లు విక్రయించకుండా తాత్కాలికంగా స్టే విధించింది. తాము జారీ చేసిన జీవో ప్రకారం ఎంవోయూ చేసుకోవాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే వారు చాలా వరకూ సంతకాలు చేయలేదు. ఎంవోయూ చేయకపోతే.. ధియేటర్లు సీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ముందుకు రాలేదు. ఈ లోపే కోర్టు స్టే ఇచ్చింది.