టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం ప్లాన్డ్ గా జరిగింది కాదు. పవన్ కల్యాణ్ మూడో తేదీన చేపట్టనున్న జనవాణి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే వంగవటి రాధా ఆఫీస్ ఉంది. దీంతో నాదెండ్ల మనోహర్ ఆయన ఇంటికి వెళ్లారు. టీ తాగారు. అంతే ఈ లోపు కొంత అత్యుత్సాహ మీడియా..సోషల్ మీడియా పులిహోర కలిపేశారు. వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలోకి వెళ్తారంటూ పుకార్లు ప్రారంభించాయి. అయితే భేటీ ముగిసిన తర్వాత ఇద్దరూ నేతలు చాలా కూల్‌గా రిప్లయ్ ఇచ్చారు.
కరెంట్ ఎఫైర్స్ కాదని కరెంట్ చార్జీలపై చర్చించామని నాదెండ్ల చెప్పారు. రాజకీయంగా ఎలాంటి విశేషం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే ఉన్న తన ఆఫీసుకు వచ్చారని అందుకే మాట్లాడానన్నారు వంగవీటి. వంగవీటి రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు ఓ రకంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలకు.. రంగా పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు.
ఎప్పుడైనా శుభకార్యాల్లో ఎదురుపడితే తన మిత్రులైన వైఎస్ఆర్‌సీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన దివంగత నేత వంగవీటి రంగా జయంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు రాధా రంగా మిత్ర మండలి ఏర్పాట్లు చేస్తోంది.ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు.