తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలు ముఖ్యంగా మోదీ, షాల కన్నా ఎక్కువగా సహకరిస్తోంది కేసీఆరే. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ ద్వారా విశ్లేషించారు. సీఎం కేసీఆర్ బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారని.. దాని వల్ల ఆ పార్టీకి ఎంతో మేలు జరుగుతోందన్నారు. బీజేపీ ఉనికే లేని ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా యువతలో బీజేపీ కి క్రేజ్ వస్తోందన్నారు. ఇతర విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి.. బీజేపీని ప్రత్యర్థిగా కేసీఆర్ తెచ్చుకున్నారని మొదటి నుంచి జరిగిన పరిణామాలతో ఆర్కే తేల్చారు.
అయితే కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడానికో లేదా.. రెండు సమాంతర శక్తుల మధ్య ఓట్లు చీలి విజయం సాధిస్తాననో కేసీఆర్ బీజేపీకి హైప్ ఇచ్చారనేది ఆర్కే విశ్లేషణ. అయితే అలా చేయడం మొదటికే మోసం తెస్తుందని ఆయన లెక్కలతో సహా చెప్పారు. బీజేపీని ప్రత్యర్థిగా ప్రకటించుకున్నప్రతీ సారి ఓడిపోయారని దుబ్బాక .. హుజురాబాద్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి వాటిని రుజువులుగా చూపించారు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాటి పరిస్థితుల్లో బీజేపీ సైలెంట్‌గా ఉంటుందని అనుకోలేమని.. కేసీఆర్ ఇచ్చిన హైప్‌తో అధికారం చేపట్టడానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుందని ఆర్కే అంటున్నారు.
అదే జరిగితే… అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ మనుగడే కష్టమని ఆర్కే తేల్చేశారు. సంస్థాగత బలం ఉన్న కాంగ్రెస్ నిలదొక్కుకోగలదు కానీ ఫిరాయింపు నేతల మీద ఆధారపడిన.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే బలంగా ఉన్న టీఆర్ఎస్ నిలబడే చాన్స్ లేదని ఆర్కే చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగా నే ఉంటుందని.. కానీ అవుటాఫ్ బాక్స్ ఆలోచించాలని ఆయన అంటున్నారు. ఆర్కే మాటల్లో కేసీఆర్ పై కోపం కానీ ద్వేషం కానీ ఉండవు. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తారు. మరి ఈ విషయాలను కేసీఆర్ ఆలోచించారో లేదో. అయితే ఆర్కే కన్నా కేసీఆరే గొప్ప రాజకీయ నాయకుడు.. విశ్లేషకుడు కూడా అనడంలో సందేహం లేదు.
మరో వైపు ఏపీలో మూడేళ్లకే ఈ ప్రభుత్వాన్ని ఇంకా రెండేళ్లు భరించాలా అనే పరిస్థితికి ప్రజలు వచ్చారని ఆర్కే తేల్చారు. ఏపీలో పరిస్థితుల్ని ఆయన కళ్లకు కట్టారు. పార్టీ క్యాడర్ హాజరు కావాల్సి నియోజకవర్గ ప్లీనరీలకు క్యాడర్ ఎవరూ రావడం లేదు.,. జనాల్ని తీసుకొస్తున్నారు. వారు మధ్యలో వెళ్లిపోతున్నారు. ఇవి కాకుండా ప్రజల్లో ప్రభుత్వ పాలనా తీరుపై అసంతృప్తి పెరిగిపోయింది. అక్కడ వైసీపీకి భవిష్యత్ లేదని ఆయన ఏకాభిప్రాయంతో ఉన్నారు.