తెలంగాణనే తమ టార్గెట్ అని బీజేపీ చెప్పకనే చెబుతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో బీజేపీ నేతందర్నీ తెలంగాణలో తిప్పుతోంది. ముందు ముందు మహారాష్ట్ర తరహా రాజకీయం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే పదవి కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చేఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగైదు నెలల ముందుగానే ప్రభుత్వం ఏం చేయలేని స్థితికి వెళ్లిపోతుంది.
బీజేపీ ఎన్నికల టార్గెట్‌గా రాజకీయాలు చేస్తుంది. ఎమ్మెల్యేల్ని కొనడం కన్నా బెంగాల్ తరహా వ్యూహం అమలు చేయవచ్చునని చెబుతున్నారు. అక్కడ టీఎంసీ నేతల్ని ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించి.. చివరికి టీఎంసీ అగ్రనేతలంతా బీజేపీలోనే ఉన్నారనిపించారు. ఎన్నికల ఏడాది మొత్తం తృణమూల్ టెన్షన్‌కు గురవుూనే ఉంది. ఇక్కడ కూడా ఎన్నికలు ఏడాది ఉంటాయనగా బీజేపీ వర్గాలు రంగంలోకి అవకాశం ఉందని భావిస్తున్నారు.
బీజేపీలోకి ఇతర పార్టీల నేతలు ఆషామాషీగా చేరిపోరు. సొంత పార్టీపై అసంతృప్తి ఉన్నంత మాత్రాన పోలోమని వెళ్లిపోరు. వారిలో వెళ్లకపోతే ఏదో జరుగుతుందని భయం పుట్టించాలి. అది బీజేపీ చేతిలో పని. సీబీఐని రాకుండా జనరల్ కన్సెంట్ ను రద్దు చేసినంత మాత్రాన్ ఆగిపోయే పరిస్థితి లేదు. ఈడీ ఉంది. ఐటీ ఉంది. ఈడీ నోటీసులు ఎంత అవసరం మేరకు నేతలకు వస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. అలాంటివి తెలంగాణలోనూ ఊపందుకుంటాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ను బలహీనపర్చే రాజకీయం ప్రారంభం కావొచ్చని భావిస్తున్నారు.