అమరావతిని నిర్వీర్యం చేసేసిన ప్రతిఫలం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వం అమరావతిలో ఫ్లాట్లు అమ్మకానికి పెడితే కొనడానికి ఎవరూ రావడం లేదు. గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్ పేరుతో అపార్టుమెంట్లు అమ్ముతామంటే ఎగబడి పది నిమిషాల్లో కొనేశారు. ప్రభుత్వం మారినా ఒప్పందాలు మారవు కదా అనుకున్నారు. కానీ ఆ కొనుగోలుదారుల ఆశల్ని ప్రభుత్వం వమ్ము చేసింది. రెరా చట్టం ప్రకారం ఒప్పందం లోపు హ్యాపీనెస్ట్ ఫ్లాట్లను ఇవ్వాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉంది. కానీ ఇవ్వడం లేదు.
అసలు కట్టనే లేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో పిలుస్తున్న ఎవరూ రావడం లేదు. అతి తక్కువ లాభానికే ఈ ప్రాజెక్టు సీఆర్డీఏ చేపట్టిందని.. చెబుతోంది. మరి అలాంటి ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లలో ఇంకా తక్కువ ఎలా వస్తుందో అధికారులకే తెలియాలి. ఎవరూ ముందుకు రావడంతో ఇప్పుడు ప్రభుత్వానికి గుదిబండగా మారింది. కట్టిన డబ్బులు ఇస్తామని.. ఫ్లాట్ ను రద్దు చేసుకోవాలని సీఆర్డీఏ లబ్దిదారులకు లేఖలు రాస్తోంది. అయితే నలుగురు ఐదుగురు మాత్రమే ఒప్పుకుంటున్నారు. మిగతా వారు ఫ్లాట్ కావాలంటున్నారు. న్యాయస్థానంలోనూ పోరాడాలని భావిస్తున్నారు.
ఇప్పుడు నిర్మాణ ఖర్చు ఎంతో పెరిగింది. ప్రారభించినప్పుడు చకచకా పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ప్రాజెక్ట్ పూర్తయ్యేది . సీఆర్డీఏకు లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు నిర్మాణ ఖర్చు అమాంతం పెరిగింది. భరించి కట్టివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి కొనుగోలుదారుల్లోనూ నమ్మకం పెరిగింది. అత్యధిక శాతం తమకు ఫ్లాటే కావాలంటున్నారు. దీంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది.