భారతీయజనతా పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అప్పగించారు. ఈమేరకు కమిటీ కన్వీనర్ గా ఆయనను నియమించారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు అయిపోగానే ఈటలకు పదవి ఇచ్చారు. కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో ఈటలకు కీలక బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు చేరికలను చూసుకునే బాధ్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీలో ప్రాధాన్యం లేదని భావిస్తున్న సీనియర్లు ఏపీ జితేందర్ రెడ్డి , గరికపాటి మోహన్ రావు, చాడ సురేశ్ రెడ్డి వంటి వారికి కూడా ఓ కమిటీ ఇచ్చారు.
బీజేపీకి పెద్ద ఎత్తువ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీలో చేరే వారు మాత్రం తక్కువగా ఉన్నారు. ఈటల మాత్రమే కొంత మందిని అతి కష్టం మీద బీజేపీలో చేర్పించగలిగారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక వెనుక కూడా ఈటల కీలకంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌లో చేరే వారు పెరుగుతున్నారు. చేరికలు సెంటిమెంట్‌ను పెంచుతాయి. అందుకే.. చేరికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
0ష్ట్రం మొత్తం మీద ఈటలకు పట్టుంది. ఉద్యమకారుల్లో ఆయనకు ఎంతో పేరుంది. టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించాలని ఈటలకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంలో ఈటల హైకమాండ్ మెప్పు పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. దూకుడును మరింత పెంచి భారీ స్థాయిలో నేతలను బీజేపీలోకి చేర్చుకునేలా ప్లాన్ చేసే అవకాశం ఉంది.