వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోంది. పార్టీని ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో రఘురామ విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నా కొంత మంది అదే బాటలో వెళ్లేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్నాళ్లుగా పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ఆయన తన పార్టీ తీరుకు నిరననగా నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి కూర్చున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డ్రైనేజీ పనులకు రూపాయి కూడా కే్టాయించడం లేదని కార్పొరేషన్ అధికారులు తన మాట వినడం లేదని నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి కూర్చోవడం సంచలనం అయింది.
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తనకు నిధులు ఇవ్వలేదనుకుంటే.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అలా డ్రైనేజీలో కూర్చోవడం కలకలం రేపింది. దీంతో ఆయన అనుచరులు కూడా వచ్చి డ్రైనేజీలో కూర్చునే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అవుతోంది. రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదనే విషయం అందరికీ తెలుసని.. ఈ విషయాన్ని మరింత దారుణంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బ్యాడ్ చేసేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఆయన మరో రఘురామలాగా మారిపోయారన్న వాదన వినిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన వైసీపీ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రాకపోగా తనను తొక్కేయాలనుకునే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత పార్టీలో ఆయన పరిస్థితి దిగజారుతోంది. అందుకే కోటంరెడ్డి తనదైన మార్క్ రాజకీయాలను ప్రారంభించారన్న వాదన వినిపిస్తోంది. అయితే తానుపార్టీ మారే ప్రసక్తే లేదని కోటంరెడ్డి చెబుతున్నారు.