ఫోటో మార్ఫింగ్‌లు, అసభ్యకరమైన భాష, కులాలను కించ పర్చడం.. ఇలా ఏ కోణం తీసుకున్నా ట్విట్టర్ పోస్టుల విషయంలో మొదటగా కేసులు పెట్టాల్సింది విజయసాయిరెడ్డి మీదనే. ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తే మొత్తం మార్ఫింగ్ ట్వీట్లు.. బూతులే ఉంటాయి. అలాంటి ఘనమైన చరిత్ర వెనకేసుకున్న విజయసాయిరెడ్డి… ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్లను తనను.. సీఎం జగన్ ను తిడుతున్నారని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే టాప్ 20 టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకున్నారు. వారి పేర్లతో సహా ఫిర్యాదు చేశారు.
దాదాపుగా ప్రతి జిల్లా నుంచి ఒకరు ఉండేలా ఈ జాబితాలో చూసుకున్నారు. నిజానికి వాళ్లు సోషల్ మీడియాలో టీడీపీ వాణిని వినిపిస్తున్న వారు. వైసీపీ నేతలు తిట్టినప్పుడు అదే లాంగ్వేజ్‌తో కౌంటర్ ఇస్తున్నవారు. వారిని కంట్రోల్ చేయడానికి విజయసాయిరెడ్డి ఈ ఫిర్యాదు వ్యూహం అమలు చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పోస్టులుపెట్టినందుకు అర్థరాత్రి పూట తలుపులు పగలగొట్టి మరీ ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారిని తీవ్రంగా కొట్టారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వీరందరూ సైలెంట్‌గా ఉండాలన్న సంకేతాలను విజయసాయిరెడ్డి ఫిర్యాదు ద్వారా పంపారు.
అయితేసోషల్ మీడియా లో వీరి పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చినా ముందుగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతాను..ఆయన ఫిర్యాదు చేసిన వారి ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే.. ముందుగాఎవరిపై చర్యలు తీసుకోవాలో క్లారిటీ వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ టీడీపీ సోషల్ మీడియాపై వైసీపీ నేతలు ఇంకా ఎక్కువ గురి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.