ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ కాదు. అంతకు మించి. అందులో వ్యక్తిగత రహస్యాలు ఉంటాయి. ఓ రకంగా మన మానసిక చరిత్రను .. సీక్రెట్ వ్యవహారాలను కూడా ఫోన్ బయటపెట్టేస్తుంది. అయితే ఎప్పుడంటే.. ఈ ఫోన్ పక్క వారి చేతికెళ్లినప్పుడు మాత్రమే. అందుకే ఓ వీఐపీ ఫోన్ మిస్సయితే ఆయనకు ఎంత టెన్షన్ ఉండాలి . ఇలాంటి టెన్షన్ ఇప్పుడు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అనుభవిస్తున్నారు. తమ జిల్లా పర్యటనకు వచ్చి వెళ్తున్న మంత్రి రోజాకు వీడ్కోలు చెప్పేందుకు ఆయన ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయన ఫోన్ మిస్సయింది.
అసలే మార్గాని భరత్ యువకుడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ప్రతి కదలికను రికార్డు చేసి పెట్టుకుంటారు. చాలా సందర్భాల్లో లైవ్‌లు ఇచ్చేస్తూ ఉంటారు. అదే సమయంలో రాజకీయంగా ఎన్నో వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి ఫోన్లోనే నిక్షిప్త సమాచారం ఉంటుంది. అందుకే ఆయన అలర్ట్ అయ్యారు. తన ఫోన్‌ను ఉద్దేశపూర్వకంగా కొట్టేశారని రోజాకు వీడ్కోలు చెబుతున్న సమయంలో పక్కనున్న వారిని గుర్తించి పోలీసుల్ని పంపి సోదాలు చేయించారు. దొరకలేదు.
ఇప్పుడు ఆ ఫోన్ కోసం ఆయన టెన్షన్ పడుతున్నారు. నిజంగా తన సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఆ ఫోన్ కొట్టేసి ఉంటే మాత్రం చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన టెన్షన్. ఆ ఫోన్ లో సీక్రెట్ సమాచారం.. డిలీట్ చేసినవి కూడా రిట్రీవ్ చేసుకునే చాన్స్ ఉంటుంది. అదే జరిగితే ఇంకా చిక్కులు తప్పవు. ఆ ఫోన్ ఖరీదు కన్నా.. . వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయనే భయం ఫోన్ పోగొట్టుకున్నవారిలో ఉంటుంది. వీఐపీ కాబట్టి మార్గాని భరత్‌లో కూడా కాస్త ఎక్కువే ఉండొచ్చు. అందుకే ఎంపీ గారి ఫోన్ ఎవరికైనా దొరికితే ఇచ్చేయండి !