సీఎం జగన్ ఎప్పుడు తన నియోజకవర్గానికి వెళుతున్నా పెద్ద ఎత్తున పనులు మంజూరు చేస్తూ.. నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అవుతూంటాయి. అయితే ఈ సారి తన తండ్రి జయంతికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నా జీవోల సందడి లేకుండానే వెళ్లిపోతున్నారు. నిధుల కేటాయింపులు కూడా ప్రత్యేక పథకాలకు చేయలేదు. దీంతో వైసీపీ వర్గాలు కూడా కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నాయి.
జగన్ సీఎం అయిన తర్వాత పులివెందులకు కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పనులను ప్రకటించారు. మొదటగా పులివెందుల బస్టాండ్ దగ్గర్నుంచి తన తండ్రి వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయను వందల కోట్లతో అభివృద్ధి చేయడం వరకూ చాలా పనులకు జీవోలిచ్చారు. ఓ సారి దాదాపుగా 30 వరకూ జీవోలు విడుదల చేశారు. ఆ పనుల మొత్తం విలువ పదమూడు వందల కోట్లు. ఆ తర్వాత పులివెందుల ప్రాంతంలో తాగునీటి సరఫరాకు రూ. 480 కోట్లు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు .. పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి పులివెందులలో మెట్రో స్థాయిలో మిని శిల్పారామం, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ … జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటు.. అలాగే… భారీ మాల్ మల్టిప్లెక్స్ ఇలా చాలా ప్లాన్లు జగన్ ప్రకటించారు.
ఇప్పుడు వాటి పనులు ఎక్కడ ఉన్నాయా అని ఆరా తీస్తే ఇంకా జీవోల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. చివరికి పులివెందులకు బస్ స్టేషన్ లేదని.. ప్రపంచస్థాయి బస్ స్టాండ్ నిర్మిస్తామని.. విమానం ఆకారంలో ఉన్న గ్రాఫిక్‌ను మీడియాకు వదిలారు. ఆ నిర్మాణంలో ఇంత వరకూ కదలిక రాలేదు. పునాదులు వేసి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ వెళ్లిపోయారు. ఇటీవల ఓ తడికల బస్టాండ్ ప్రారంభించి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇన్ని పనులు పెండింగ్‌లో ఉంటే కొత్తగా ఏదైనా జీవోలిస్తే.. ఇబ్బందని.. ఎలాంటి జీవోలియ్యకుడానే ఈ సారి వైఎస్ జయంతికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.