దక్షిణాది నుంచి నలుగురు సినిమా, స్పోర్ట్స్ , అధ్యాత్మిక రంగ ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్రం. ఈ నలుగురు పేర్లను ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ అవకాశం వచ్చింది. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తండ్రి. రాజమౌళి అన్ని సినిమాలకు రచయితగా వ్యవహరిస్తూంటారు. సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో ఉన్నారు. కొన్ని సినిమాలకూ దర్శకత్వం వహించారు. తమిళనాడు నుంచి ఇళయరాజాకు చాన్సిచ్చారు. పరిచయం అవసరం లేని దిగ్గజం ఇళయరాజా. ఇటీవల ఆయన బీజేపీ ప్రముఖుల్ని పొగిడి రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా హింట్ ఇచ్చారు.
ఇక కేరళకు చెందిన పరుగుల రాణి పిటి ఉషకు.. కర్ణాటకలోని ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకు కూడా రాజ్యసభ సీట్లిచ్చారు. వీరందరిదీ రాష్ట్రపతి కోటా కాబట్టి నేరుగా నామినేట్ అవుతారు. ఎలాంటి ఎన్నిక ఉండదు. వీరందరికీ మిగిలిన వారిలాగే ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. రాష్ట్రపతి కోటాలో వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు. తమ పార్టీలకు సన్నిహితంగా ఉన్న వారిని ఎంపిక చేస్తూంటారు.
దక్షిణాదివారిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ వస్తున్న విమర్శలకు బీజేపీ నాలుగు రాజ్యసభ పదవులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు కూడా ఈ సారి దక్షిణాదికి ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఉత్తరాదికే ఇవ్వబోతున్నట్లుగా స్పష్టయింది. దీంతో ఇప్పుడు నలుగురు దక్షిణాది వారికి చాన్సు ఇచ్చారు.