తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఇంత కాలం ముఖ్యమైన అంశాలపైనే సమీక్షలు చేసేవారు. ఇప్పుడు అన్ని అంశాలపై దృష్టి పెడుతున్నారు. పెండింగ్ లో ఉన్నవి.. సమస్యల్లో ఉన్న వాటిపై ముఖ్యంగా సిఎం కెసిఆర్ దృష్టి పెట్టారు. భూముల సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సదస్సుకి మంత్రులే కాదు అధికారులు, జిల్లా కలెక్టర్లు తప్పక హాజరుకావాల్సి ఉంది. భూ సమస్యలపైనే కాదు విద్యా, వైద్య రంగాల్లోని లోపాలను కూడా సవరించబోతున్నామని చెబుతున్నారు.
ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ గురుకులాలపై రివ్యూ చేశారు. ఇప్పటి పోటీపరీక్షలకు అనుగుణంగా వీరికి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్టడీతోపాటు ఉద్యోగ, ఉపాధిని అందించే విధంగా ఈ స్టడీ సర్కిల్స్ ఉంటాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 130కి పైగా స్టడీ సర్కిల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. నిధులు, నీళ్ల విషయం కన్నా నియామకాల విషయంలోనే తెలంగాణ యువత ఎక్కువ అసంతృప్తిలో ఉందనే ప్రచారం జరుగుతోంది. గతకొన్నాళ్లుగా నియామకాల కోసం నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఊహించిన విధంగా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు విడుదల కాలేదు.
ఈ అసంతృప్తులను చల్లార్చేందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం.. సమస్యలు ఎక్కువగా ఉండటంతో టీఆర్ ఎస్ అధినేత పాలనపై మళ్లీ దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఓ వైపు కేటీఆర్ అటు రాష్ట్ర పార్టీని కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో పాలన సమవ్వయం కావడం లేదు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగినట్లయింది.