“వెనక్కి చూసుకోవడం” అంటే సమీక్షించుకోవడం. తాము ఏం చేశామని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం .. ముందుకెళ్లాలనుకున్నవారికి అవసరం. మనుషులకు.. సంస్థలకు… కార్పొరేట్ సామ్రాజ్యాలకు… ప్రభుత్వాలకు ఇంకా చెప్పాలంటే రాజకీయ పార్టీలకూ వర్తిస్తుంది. మనమేం చెప్పాం.. మనమేం చేశాం .. చెప్పినట్లు మంచే చేశామా ? మంచి చేస్తామని చెడు చేశామా ? ఇవన్నీ ఆలోచించుకుకుని రివ్యూ చేసుకోవాలి. అయితే ఈ రివ్యూ ఎప్పుడూ రివర్స్ కాకూడదు., అంటే వెనక్కిచూసుకోవడం అంటే.. వెనక్కిపోవడం అనుకోకూడదు. అలా అనుకుంటే.. అంతే చేస్తే మూలాలు బలహీనపడినట్లే. ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ జరుపుకుంటోంది. పార్టీ పెట్టిన తర్వాత ప్రతి రెండేళ్లకు ప్లీనరీ జరుపుకుని తమ పనితీరును సమీక్షించుకుని.. లక్ష్యం నిర్దేశించుకోవడం కామన్. ఇక్కడ వైసీపీ తీరు మాత్రం ఎప్పుడు ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటే అప్పుడు మాత్రమే పెట్టుకుంటుంది. అది వారిష్టం. రాజకీయ పార్టీగా వారి తీరును మనం ప్రశ్నించలేం. విమర్శించలేం. కానీ ప్రస్తుతం వైసీపీ అధికార పార్టీ .. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను తమ చేతుల్లో తీసుకున్న పార్టీ. ప్రజలు యాభై శాతం ఓట్లతో ఆదరించిన పార్టీ. ఇప్పుడా పార్టీ గతంలో ఏం చెప్పింది.. ఇప్పుడు ఏం చేస్తోంది.. అనేది తన ప్లీనరీలో సమీక్షించుకుంటుందా ? తమ నలుపేమిటో గుర్తిస్తుందా ? తాము ఏది చేస్తే అదే కరెక్ట్.. అనే మొండి వాదనకే కట్టుబడి ఉంటుందా? అసలు తమ నిర్ణయాలు ఎంత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో కనీసం గుర్తించడానికైనా సిద్ధపడతారా ..? శుభమా అని ప్లీనరీ నిర్వహించుకుంటూంటే ఈ ప్రశ్నలు… విమర్శలేమిటని కొంత మందికి అనిపించవచ్చు. కానీ తెలిసీ తప్పుడు మార్గంలో పయనిస్తున్న పార్టీ… ఆ తప్పుడు మార్గం వల్ల నష్టపోతున్న ఓ రాష్ట్ర భవిష్యత్ కోసం …తప్పులు గుర్తిస్తారని.. తమ రివర్స్ నడకను తెలుసుకుంటారన్న చిన్న ఆశతో ఇలా స్పందించకతప్పడం లేదు.
” ఆ మరణాల ” పునాదిగా ముందుగానే పార్టీని ప్లాన్ చేసిన జగన్ !
అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజులు. జగన్‌పై సానుభూతి మహా వెల్లువలా ఉంది. ఆ సానుభూతిని రాజకీయంగా వాడుకోవడంలో జగన్ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుపేదలు ఏ సహజ మరణం జరిగినా దాన్ని వైఎస్ ఖాతాలో వేస్తూ సాక్షి మీడియా లిస్ట్ ప్రకటించడం ప్రారంభించింది. అదే సమయంలో జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న ప్రదర్శన జరిగినా దానికి పెద్ద కవరేజీ ఇవ్వడం ప్రారంభించింది. జగన్ కాంగ్రెస్‌ను వదిలేస్తారని ఊహించలేని కొంత మంది ఇదంతా రొటీన్ అనుకున్నారు. కానీ కొన్నాళ్లకు జగన్ తండ్రి చనిపోవడంతోనే ప్రత్యేక పార్టీకి ప్రణాళిక వేసుకున్నారని తర్వాత వైఎస్ కోసం చనిపోయిన వారిని ఓదారుర్సాతనంటూ సాక్షి ప్రకటించిన లిస్టుతో ఓదార్పు యాత్ర ప్రారంభించడంతో తేలిపోయింది. ఆ ఓదార్పు యాత్ర వద్దన్నారంటూ యాగీ చేసి.. సోనియాపై నిందలేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయానికి అవసరమైనంత సేపే ఓదార్పు యాత్ర జరిగింది. అధికార అందలం ఎక్కిన తర్వాత ఆపేశారు. నెలల తరబడి జరిగిన ఓదార్పు యాత్రలో ఇంకా చాలా మందికి సాయం చేయాల్సి ఉంది. చేపట్టాలనుకున్నది చేపట్టిన తరవాత మర్చిపోయారు. అలా పుట్టిన వైసీపీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో టాప్ ఫైవ్‌లో ఉంది. ప్రజలు అంతగా పట్టం కట్టారు. ఏకపక్షంగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లిచ్చారు. కానీ ఇది ఆషామాషీగా రాలేదు. పాదయాత్రతో జగన్ చెప్పిన ఎన్నో మాటలకు వచ్చాయి. వెనుక వైఎస్ ఇమేజ్ ఉండటంతో ఆ మాటలను జనం సులువుగా నమ్మారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.
ఒక్క అబద్దం చెప్పలేదని ప్రచారం – చెప్పినవన్నీ రివర్స్ !
రుణమాఫీ చేస్తానని ఒక్క హామీ ఇచ్చి ఉంటే తాను 2014లో గెలిచేవాడినని .. కానీ అలా చేయలేను కాబట్టి ఇవ్వలేదని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పేవారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని నమ్మించేందుకు ఆయన చెప్పిన డైలాగ్ అది. 2019లో అధికారంలోకి వచ్చి న తర్వాత ఆయనేం చేశారు ? మచ్చుకు ఒక్కటి తీసుకుందాం.. మద్యనిషేధం. ప్రజల జీవితాల్ని ఈ మద్యమే బుగ్గి చేస్తోందని… దాన్ని కంటికి కనపడకుండా చేస్తానని.. ఆయన చేసిన ప్రకటన హావభావాలతో సహా ప్రజలకు గుర్తుంది. యువకుడు.. ఇంత ఆవేశంలో ఉన్నాడంటే ఇక మద్యం పనైపోయినట్లేనని అనుకున్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఏం జరిగింది. కల్తీ మద్యం మాత్రమే అమ్ముతున్నారు.. దేశంలో ఎక్కడా అమ్మని మద్యం.. ఫర్ సేల్ ఓన్లీ ఆంధ్రా మద్యం అమ్ముతున్నారు. బ్రాండ్లకు చోటు లేదు. అంతకు మించి.. ధరలు. రోజంతా కష్టపడి సాయంత్రం కాస్త మందు తాగే అలవాటున్నవారికి.. వారు రోజంతా సంపాదించిన సొమ్మును మద్యం రూపంలో ప్రభుత్వం లాగేసుకుంటోంది. ఈ కారణంగా ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో చెప్పడం ఈడీ. తిరుపతిలో ఇలా ఓ వ్యక్తి.. మద్యం కారణంగా సర్వం కోల్పోయానని జగన్ ను బూతులు తిడితే.. తర్వాత అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నిజానికి ప్రతి మద్యం దుకాణం దగ్గర ప్రభుత్వానికి..జగన్‌కు ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది. చెప్పిందానికి చేసిందానికి పొంతన లేకుండా.. మందు బాబుల్ని ఏకంగా పాతికేళ్ల పాటు తాకట్టు పెట్టేశారు. అంటే మొత్తం రివర్స్‌లో చేసేశారు.
అన్నీ నిర్ణయాలు రివర్స్.. రివర్స్ తర్వాత మళ్లీ రివర్స్ !
ఒక్క మద్యం కాదు.. ఫలానా నిర్ణయంలో తాము చెప్పినట్లు చేశామని.. ప్రభుత్వం కానీ.. వైసీపీ కానీ.. గుండెల మీద చేయి వేసుకుని చెబితే గొప్పే. ఏ ఒక్క విషయంలోనూ అలా చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో అవినీతి .. రాగానే బయటపెడతామన్నారు. పోలవరం లాంటి వాటిలో అవినీతే లేదని స్వయంగా కేంద్రానికి రాసిచ్చారు. అమరావతి వంటి చోట్ల అవినీతి అంటూ… ఇప్పటికీ చెబుతున్నారు. కానీ తప్పుడు ఎఫ్ఐఆర్లతో పరువు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలు పలువుర్ని అవినీతి కేసుల్లో అరెస్టులు చేశారు. కానీ కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని వారే కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. ఒక్క రూపాయి అయినా టీడీపీ నేతల అవినీతి సంపాదన బయట పెట్టలేపోయారు. విద్యుత్ ఒప్పందాలు పాతికేళ్లు ఎవరైనా చేసుకుంటారా ? జగన్ ఆశ్చర్యపోయారు. ఇంత కంటే అవినీతి ఉంటుందా అన్నారు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో ఏకంగా ముఫ్పై ఏళ్లకు చేసుకున్నారు. మరి గతంలో జగన్ అన్న మాటలకు ఇప్పుడు చేసిన చేతలకు పొంతనేముంది .. మొత్తం రివర్సే కదా ..! ఒక్క విద్యుత్ ఒప్పందాలు మాత్రమే కాదు అధికారిక నిర్ణయాల్లోనూ అదే తంతు .. చంద్రబాబు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తెద్దామని అమలు ప్రారంభిస్తే తెలుగుకు చెదలు అంటూ కొంత మందితో రచ్చ చేయించారు. మీడియాలో తిట్టిపోశారు. చివరికి అది పేద విద్యార్థులకు అందకుండా చేశారు. ఇప్పుడు ఏ మాత్రం ప్రణాళిక లేకుండా ఇక ఇంగ్లిష్ మీడియమే అని ప్రకటించేశారు. విద్యార్థుల జీవితాలతో అడుకున్నారు. టెన్త్ , ఇంటర్ ఫలితాలతోనే అది తేలిపోయింది.
పోలవరం తప్పిదాలతో రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి !
సీఎంగా జగన్ తీసుకున్న రివర్స్ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్‌ను ప్రజల్ని తీవ్రంగా నష్టపరిచాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిని తప్పు పట్టి.. తాము రాగానే అంత కంటే గొప్పగా చేస్తామన్నారు. కానీ అన్నీ గత ప్రభుత్వం చేసినవే చేస్తున్నారు. కానీ ఇక్కడ అన్నీ ఆపేసి మళ్లీ తమ కోసం కొత్తగా ప్రారంభించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ శరవేగంగా నిర్మాణం అయ్యేది. రివర్స్ టెండర్ పేరుతో ఆపేశారు. గత మూడేళ్ల నుంచి ఒక్క శాతం పని జరిగింది. కేంద్రం పైసా ఇవ్వడం లేదు. ఓ ఇంటి నిర్మాణం మూడేళ్లు ఆగితే నిర్మాణ ఖర్చు ఎంత పెరుగుతుందో అందరికీ తెలుసు. అలాంటిది పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు ఆగితే రోజుకు ఎంత నష్టం ? ఇవన్నీ పాలకుడికి పట్టలేదు. ముందు ఆపేశారు.. ఇప్పుడు రివర్స్‌లో వెళ్తున్నారు. పోలవరంతో ప్రారంభించి రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్స్ను రివర్స్ చేశారు. కానీ ఒక్కటైనా ప్రారంభమైంది. దాదాపుగా పూర్తయిన గుండ్లకమ్మను ప్రారంభించలేకపోయారు. టీడీపీ హయాంలో దూకుడుగా సాగిన ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం..ఇప్పుడు ఆగిపోయింది. వాటిపై సమీక్షలు చేస్తూ.. సీఎం జగన్.. అయిపోవాలి అంటారు. కానీ అదంతా ప్రెస్ నోట్ల కోసమే. అక్కడ ఏమీ జరగదు. మూడేళ్లుగా ఇదే రివర్స్ వ్యవహారం.
పథకాల అమల్లోనూ ప్రజలకు రివర్స్ పంచ్‌లు !
పథకాల అమలులోనూ ఇదే రివర్స్. కేంద్రం కిసాన్ పథకాన్ని ప్రకటించడానికంటే ముందే జగన్ రైతు భరోసా ప్రకటించారు. ప్రతి మే నెలలో పన్నెండున్నర వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక.. కేంద్రం ఇస్తున్న కిసాన్ డబ్బులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. మూడు విడతలు చేశారు. దీంతో రైతులకు మొదటి రివర్స్ నిర్ణయంతో షాకిచ్చారు. అది మొదలు రైతు పథకాలన్నీ ఆగిపోయాయి. మూడు వేల కోట్ల స్థీరకిరణ నిధి దగ్గర్నుంచి ఎన్నో మాటలు. ఒక్కటీ అమలు కావడం లేదు. చివరికి బీమా కూడా రైతులకు అందని పరిస్థితి. అన్ని పథకాల్లోనూ అదే తంతు. అమ్మఒడి విషయంలో మాత్రం కాస్త తల్లులకు డబ్బులు చేరుతున్నాయనుకంటే.. ఏడాదికో రెండు వేలు తగ్గిస్తున్నారు. ఆ డబ్బులు స్కూళ్లకు ఇవ్వడం లేదు. లబ్దిదారులను తగ్గిస్తున్నారు. అమ్మఒడి గ్రీవెన్స్ అని పెడితే.. ఒక్క నియోజకవర్గంలోనే వేల మంది వస్తారంటే.. లబ్దిదారులను ఎంత ఘోరంగా వంచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మేనిఫెస్టోను ముందు పెట్టుకుని నవరత్నాల్లోని ఒక్కో పథకాన్నితీసుకుంటే..ఎంత దారుణంగా రివర్స్ పాలన చేస్తున్నారో అర్థమైపోయింది.
అమరావతిపై నాడు చెప్పిందేంటి ? నేడు చేసిందేంటి?
అసలు వైసీపీ పాలనలో విషాదమేమిటంటే ఏపీ పునాదుల్ని పెకిలించి వేయడం. రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ముఖ్యం. తెలంగాణకు హైదరాబాద్‌లా.. కర్ణాటకు బెంగళూరులా… తమిళనాడుకు చెన్నైలా … ఆర్థికంగా అండగా ఉండాలి. ఏదీ లేకపోతే ఆ రాష్ట్రం ముందుకెళ్లదు. అందుకే అమరావతికి ప్లాన్ చేశారు. జగన్ స్వయంగా ఒప్పుకున్నారు. 35వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో చెప్పారు. ఆ మేరకు రైతులిచ్చారు. కానీ తానేం చేశారు. తన మాటలను రివర్స్ తీసుకున్నారు. సీఎం పదవి చేపట్టే వరకూ అమరావతే రాజధాని అన్నారు. తర్వాత అడ్డగోలు రివర్స్ తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలు కొన్ని లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. రివర్స్ నిర్ణయంతో ఏపీ భవిష్యత్ అంధకారమైంది. రివర్స్ పాలనలో ప్రజల నెత్తిపై ఒక్కొక్కరిపై రూ. ఏడు లక్షల అప్పు వచ్చి పడింది. ప్రభుత్వ రుణభారం చూస్తే ముందు ముందు ప్రభుత్వ ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోదు. రాజకీయ కారణాలతో కేంద్రం నుంచి తగినంత మద్దతు పొందుతున్న వైసీపీ దాన్ని … రాష్ట్రం కోసం వాడుకోలేదు. రాష్ట్ర వినాశనానికి వాడుతోంది. విచ్చలవిడిగా అప్పులు చేస్తే ఎప్పుడో ఓ సారి చేతులెత్తయకతప్పదు. అయితే అలా చేతులెత్తేస్తే నష్టపోయేది ఘనత వహించిన జగనో..మరొకరో కాదు. రాష్ట్రం. రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే ఏపీలో కనీస సౌకర్యాలు లేవు. పొరుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుతున్నారు. పొరుగు రాష్ట్రాల పాలకులు ఎగతాళి చేస్తున్నారు. ఇలా రివర్స్ గురించి చెప్పుకుంటే లెక్కేలేదు. చివరికి సొంత బాబాయ్ ను చంపిన వారికి రక్షణ ఇవ్వడం.. తల్లి, చెల్లిని కూడా దూరం పెట్టడం.. రాజకీయంగా ప్రత్యర్థుల్ని వేధించడం…. ఇలాంటి వాటి గురించి చెప్పుకుంటే… గుర్తు చేసుకుంటే… ఇంత దారుణమైన రివర్స్ పాలనేంటి అని.. ఎవరికైనా డౌట్ వస్తుంది.
తప్పుల్ని తెలుసుకుంటేనే ప్లీనరీకి అర్థం.. లేకపోతే రివర్సే !
ఇప్పటికైనా మంచిపోయింది లేదు.. వైసీపీకి ఇంకా రెండేళ్ల గడువు ఉంది. గతంలో తాము ఏం చెప్పాం..? ఇప్పుడేం చేస్తున్నాం ? ఎందుకలా చేయాల్సి వచ్చింది ? రాష్ట్రానికి మంచి చేశామా ? చెడా ? ఇలాంటివన్నీ… కులాల కోణంలో కాకుండా మానవత్వ కోణంలో.. భవిష్యత్ కోసం ప్లీనరీలో ఆలోచించి … తప్పులు దిద్దుకుంటే… వైసీపీకి భవిష్యత్ ఉంటుంది. అలా చేయడం రాజకీయ పార్టీల విధి కూడా. అలా చేస్తేనే ప్లీనరీకి విలువ. లేకపోతే.. మొత్తం రివర్స్ అవుతుంది. అప్పుడు తప్పులు దిద్దుకుని ప్రయోజనం ఉండదు..!