రాజకీయ నాయకులు అదీ అధికార పార్టీ నాయకుల దగ్గర కోట్లకు కోట్లు మూలుగుతూ ఉంటాయి. వాటిని ఎలా బినామీలుగా చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కాకపోయినా కొంత మంది అంతే. అయితే తాడిదన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు. ఇది సామెతే కాదు నిజం. చిత్తూరు ఎమ్మెల్సీని ఇలా కోట్లతో ఓ యువకుడు బురిడీ కొట్టించాడు. నిండా పాతికేళ్లు లేకపోయినా కోట్లు కొట్టేశాడు. ఇప్పుడా ఎమ్మెల్సీ నేరుగా కేసు పెట్టలేక.. ఆ కుర్రాడిపై ఏదో కేసు పెట్టి లోపలేయించి.. అనధికారికంగా తన డబ్బు వసూలు చేసుకోవాలనుకుంటున్నారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు నాయక్ అనే పాతికేళ్ల యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తిరుపతిలో చదువుకున్నాడు. అయితే రెండేళ్లలోనే తాను డీఆర్డీవో యువ శాస్త్రవేత్తనని చెబుతూ ఖరీదైన జీవితం గడపడం ప్రారంభించాడు. స్వగ్రామంలో కోటికిపైగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టించారు. ఖరీదైన కార్లు కొన్నారు. వాటికి నేరుగా డీఆర్డీవోలో యువ శాస్త్రవేత్త అని పేరు పెట్టుకున్నాడు. ఇద్దరు గన్మెన్, ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు అనుచరులను వెంటబెట్టుకుని రెండు ఖరీదైన కార్లలో తిరిగేవాడు.
అయితే ఎవరినైనా మోసం చేశారా అన్నదానిపై వివరాలు లేవు. కానీ పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారు. తాను తిరుపతిలో చదువుతున్న సమయంమలో అక్కడ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీతో పరిచయం పెంచుకున్నారని.. తెలుస్తోంది. తాను బినామీగా వ్యవహరించేలా నమ్మించారని తెలుస్తోంది. అలా ఆయన రూ.కోట్లలో ఈ యువకుడికి ఇవ్వడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ఎమ్మెల్సీ సీఐడీని ఆశ్రయించారు. ఎమ్మెల్సీని ఏవిధంగా మోసం చేశాడు? ఎంత మొత్తంలో నొక్కేశాడు? అన్న విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తం బయటకు వస్తే ఎమ్మెల్సీకి అంత పెద్ద మొత్తం ఎలా వస్తుందని బయట లెక్కలడుగుతారు కదా మరి..!