టీఆర్ఎస్లో పార్టీ నేతల ఆధిపత్య పోరాటం ఆ పార్టీకి పెనుముప్పుగా మారింది. ముఖ్యంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా మరింది. ఎమ్మెల్యేలు కాకపోయినా ఇతర పార్టీల నేతలు బంగారు తెలంగాణ కోసం వచ్చి చేరిన చోట ఉన్న ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ టీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం వీరి మధ్య సయోధ్య చేసేందుకు పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. ఈ అంశంపై టీఆర్ఎస్ క్యాడర్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పార్టీ బలోపేతం కోసం గతంలో తీసుకున్న కొన్ని చర్యలు ఇప్పుడు పార్టీ బలహీనపడటానికి కారణం అవుతున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి అన్ని స్థాయిల్లో చేరికలను ప్రోత్సహించడంతో ఇప్పుడు మెజార్టీ నియోజవర్గాల్లో రెండు బలమైన వర్గాలున్నాయి. ఎన్నికల్లో వారికి చాన్సివ్వకపోతే పక్క చూపులు చూసేందుకు సిద్ధమని సంకేతాలు పంపుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత పరిష్కరించుకోవాల్సిన అతి ముఖ్యమైన సవాల్ గా మారిపోయింది. సీనియర్ నేతలపై గెలిచిన వారిని కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు ఉంటారు. టీఆర్ఎస్లోనూ ఉంటారు. కానీ టీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు భిన్నం. ఎందుకంటే టీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ. టీఆర్ఎస్లో సీటు దక్కదనుకున్న వాళ్లంతా పరుగులు పెట్టి ఇతర పార్టీల్లో చేరి టిక్కెట్ పొందడం ఖాయమే. వారి కోసం కాంగ్రెస్, బీజేపీ కాచుకుని కూర్చున్నాయి. బీజేపీ అయితే బంపర్ ఆఫర్లను కూడా ప్రకటించే చాన్స్ ఉంది. ఈ విషయంలో కేసీఆర్ వీలైనంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం అందుకే సొంత పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది.