Happy Birthday movie review telugu
రేటింగ్: 2.25
నిజమే… కామెడీ సినిమాల్లో లాజిక్ వెదక్కూడదు. అలా వెదికితే మ్యాజిక్ మిస్సయిపోతాం. పైగా సర్రెలిస్టిక్ కామెడీ సినిమా అని చెప్పేశాక…. లాజిక్ గురించి అస్సలు ఆలోచించకూడదు. `హ్యాపీ బర్త్ డే` ఆ జోనర్ సినిమానే. తెలుగులో ఇప్పటి వరకూ రాని, ఎవరూ చేయని సర్రెలిస్టిక్ కామెడీ సినిమా అనే సరికి అంతా.. అటువైపు ఓ లుక్కేశారు. ఏం చెబుతారో, ఎలా నవ్విస్తారో? అని ఆశ పడ్డారు. ట్రైలర్‌ని కట్ చేసిన విధానం, ఈ సినిమాని ప్రమోట్ చేసిన పద్ధతి… ఇంకాస్త ఆసక్తిని పెంచాయి. ఆ హ్యాపీ బర్త్ డే… ఇప్పుడు ధియేటర్లలోకి వచ్చేసింది. ప్రమోషన్లలో ఉన్న క్రియేటివిటీ, పబ్లిసిటీలో చూపించిన వెరైటీ సినిమాలో ఉన్నాయా? ఉంటే ఏ మేరకు అలరించింది?
కథలోకెళ్తే… ఢిఫెన్స్ మినిస్టర్ రిత్విక్ సోధీ (వెన్నెల కిషోర్) ఇంటింటికీ గన్ను అనే బిల్లు ప్రవేశ పెట్టించి, పాస్ చేయిస్తాడు. దాంతో… కూరగాయలు అమ్మినట్టు సంతలో గన్నులు అమ్మేస్తుంటారు. మరోవైపు… తన బర్త్ డే రోజున ఓ పాష్ పబ్బులో పార్టీ చేసుకుందామని వెళ్తుంది హ్యాపీ (లావణ్య త్రిపాఠీ). అదే హోటెల్ పనిచేస్తున్న లక్కీ (అగస్త్య) ఓ లైటర్ సంపాదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. మాక్స్ (సత్య) ఓ శవాన్ని పాతిపెట్టే డీల్ ఒప్పుకొని.. అదే పబ్‌కి వస్తాడు. ఆ తరవాత… రకరకాల క్యారెక్టర్లు పబ్‌లోకి వస్తుంటాయి. ఇంతకీ హ్యాపీని కిడ్నాప్ చేసిందెవరు? ఆ లైటర్ సంగతేమిటి? ఈ అన్ని పాత్రలకు ఒకరితో మరొకరికి సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ తెరపైనే చూడాలి.
దర్శకుడు రితేష్ రానాకి కామెడీ పల్స్ తెలుసు. `మత్తు వదలరా` లో కామెడీ సీన్లు హైలెట్ అయ్యాయి. ఆ సినిమా విజయం సాధించడానికి అదే బలమైన కారణం. తను ఇప్పుడు కొత్తగా తెలుగులో ఓ జోనర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే తప్పకుండా అంచనాలు పెరుగుతాయి. `హ్యాపీ బర్త్ డే` పై ఆసక్తి పెరగడానికి కారణం అదే. అయితే ఆ అంచనాల్ని… రితేష్ అందుకోలేకపోయాడు. కామెడీ సినిమాలకు లాజిక్ అవసరం లేదు. కానీ… కథ దగ్గర మాత్రం లాజిక్ ఉండాలి. తలా తోక లేని కథని, అర్థం కాని రీతిలో ప్రదర్శించి, దాన్ని సర్రెలిస్టిక్ కామెడీ అనుకోమంటే ఎలా?
పార్లమెంట్లో వెన్నెల కిషోర్ బిల్ పాస్ చేసే సీన్ చాలా సెటైరికల్ గా తీశాడు. మంత్రి మాట్లాడుతుంటే, మిగిలిన వాళ్లు ఎవరి పనుల్లో వాళ్లు ఉండడం, ఒకాయన అయితే… కత్తి పట్టుకొని వెళ్లి, ఎవరినో నరికి రావడం.. ఇదంతా సర్రెలిస్టిక్ కామెడీనే. ఆ తరవాత ఇంటర్వ్యూ కూడా సరదాగానే సాగింది. ఇదంతా చూస్తే… ఈసారి కూడా ప్రేక్షకుల పొట్ట చెక్కలు అవ్వడం ఖాయమన్న నమ్మకం ఏర్పడుతుంది.
`ఏ ఫ్యూ మినిట్స్ లేటర్`….
అదంతా మన భ్రమ అని తేలిపోతుంది. ఎందుకంటే తెరపై ఏదేదో జరుగుతుంటుంది. ఎవరెవరో వస్తుంటారు. ఒకట్రెండు సార్లు ఫన్ వర్కవుట్ అవుతుంది. కానీ.. చాలా సార్లు తేలిపోయింది. వెండి తెరపై జబర్దస్త్ ని చూస్తున్న ఫీలింగ్. అది కూడా.. పేలని ఎపిసోడ్లు వరుస పెట్టి వేస్తున్నట్టు ఉంటుంది. అగస్త్య ట్రాక్ చాలా బోర్ కొట్టిస్తుంది. `బిచ్చగాడు`లోని తల్లి సెంటిమెంట్ పాటని రింగ్ టోన్ గా పెట్టుకొని, ఆసుపత్రిలో సిస్టర్స్ లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతుంటే… `ఏంట్రా ఈ నస` అనిపిస్తుంది. మీమ్స్‌ని విపరీతంగా వాడారు. `గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో..` అంటూ ఈమధ్య బాగా పేలిన ఓ డైలాగ్… ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. దర్శకుడిలో కామెడీ టింజ్ ఉంది. సెటైర్లు వేయగల నేర్పు ఉంది. తన సినిమాపై తానే సెటైర్లు వేసుకొన్నాడు. పబ్‌లో పాట వస్తుంటే.. కింద `మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం` అని డిస్లైమర్ వేశారు. మరోవైపు `ఈ పాటని నిర్మాత కోరిక మేరకు చిత్రీకరించడం జరిగింది` అని రాసుకొన్నారు. నిజంగా.. సర్రెలిస్టిక్ అంటే.. ఇదే. కానీ.. కొన్నిసార్లు మరీ అతికి పోయారు. ఇంకోసారి.. లేనిపోని సీన్స్‌ని అతికించుకుంటూ వెళ్లారు. సత్య ఎంట్రీ కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆటోమెటిక్ కారుని ఎలా నడపాలో తెలియనప్పుడు… యూ ట్యూబ్ వీడియో ప్రకారం ఫాలో అవుదామని, యూ ట్యూబ్‌లోకి వెళ్లాడు సత్య. ఆ వీడియో, సత్య ఎక్స్ప్రెషన్స్ బాగా నవ్విస్తాయి. అయితే ఈ సీన్ కూడా `వెల్ కమ్` సినిమాలోని ఓ కామెడీ బిట్ కి స్ఫూర్తి అని ఈజీగా కనిపెట్టేయొచ్చు. చివర్లో ట్రాన్స్ లేషన్ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. ఈమధ్య మధ్య దర్శకుడు తన అతి తెలివిని చూపించడానికి ప్రయత్నించాడు. దాంతో కథంతా గందరగోళంతా తయారవుతూ వెళ్తుంది. సెకండాఫ్‌లో.. మరింత గజిబిజి. ఓ దశలో అసలు కథేంటో అర్థం అవ్వదు. తుపాకీల మోత.. అర్థం లేని డైలాగులు, యాక్షన్ సీన్లు, అక్కర్లేని ట్విస్టులతో.. సినిమా హోరెత్తిపోతుంటుంది.
ఇంటింటికీ గన్ను ఇస్తే… ఎలా ఉంటుందన్నది దర్శకుడి ఆలోచన. ఈ కథ అక్కడి నుంచే పుట్టింది. దాన్ని పక్కన పెట్టి.. ఏదేదో చెప్పుకొంటూ వెళ్లాడు. సినిమా అంతా ఒకే లొకేషన్లో చుట్టేయాలి అనుకొని ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసినట్టుంది.
లావణ్య త్రిపాఠికి ఇది కొత్త రకం పాత్ర. తను చాలా జోష్ గా కనిపించింది. ఉన్నంతలో బెటర్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఈ సినిమాకి హీరో ఎవరంటే.. సత్య అని చెప్పాలి. ఎందుకంటే… తన ఎపిసోడ్ల వల్లే.. కాస్తో కూస్తో నవ్వుకోగలిగాం. అగస్త్యని సరిగా వాడుకోలేదు. సత్య – గుండు సుదర్శన్ ట్రాక్ కూడా ఓకూ అనిపిస్తుంది. క్యారెక్టర్లు, ట్రాకులు మరీ ఎక్కువైపోయేసరికి… అసలు ఏ ట్రాకూ గుర్తుండదు, ఏ క్యారెక్టరూ.. కనెక్ట్ అవ్వదు. ఈ సినిమా మొత్తం కొత్త కలరింగులో కనిపించింది. ఒక థీమ్ ప్రకారం సాగింది. రితేష్‌లో విషయం ఉంది. కాకపోతే.. తను సరైన సబ్జెక్టుల్ని డీల్ చేయాలి. మొత్తంగా చూస్తే… అక్కడక్కడ నవ్విస్తూ, చాలా చోట్ల బోర్ కొట్టించే… సినిమా ఇది. ఓ రకంగా చెప్పాలంటే జబర్దస్త్ కి ఎస్టెంషన్ అనుకోవొచ్చు. అంతే.
రేటింగ్: 2.25