తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనన్న వాదన వినిపించింది. ఈ అంశంపై హైకోర్టులో కేంద్రం స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. ఆయన ఏపీకి పంపాల్సిందేనని తెలిపింది. దీంతో ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. కేంద్రం కూడా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పినందున సోమేష్ కు షాక్ తగలడం ఖాయమన్న వాదన లాయర్లలో వినిపిస్తోంది.
సోమేష్ కుమార్‌ను విభజన సమయంలో ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. కానీ ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి సీఎస్ అయ్యేంత సీనియారిటీ ఆయనకు లేదు. తన సర్వీసు మధ్యలో రెండు సార్లు నాలుగేళ్ల పాటు సర్వీసును వదిలి ప్రైవేటు సంస్థల్లో పని చేశారు. పది మందికిపైగా సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ సోమేష్‌కు చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు.
సీఎస్ తీరుపై బీజేపీ కూడా అసంతృప్తిగా ఉంది. ఆయనపై కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఆయనను ఏపీకి పంపాలనే స్పష్టమైన అభిప్రాయంతో ఉండటంతో … సోమేష్ తన క్యాడర్‌ను కాపాడుకోవడం కష్టమని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కేసీఆర్‌కు కూడా ఇబ్బందికరమే. ఆయన ఏరికోరి వచ్చే ఎన్నికల వరకూ సోమేష్ ఉండేలా చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయనను ఏపీకి కేటాయిస్తే.. కొత్త సీఎస్‌ను కేసీఆర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.