మణిరత్నం సినిమాలంటే ఎలా ఉంటాయి? సున్నితమైన భావోద్వేగాలతో హాయిగా సాగిపోతాయి. ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఇన్నేళ్లుగా మణిరత్నం సినిమాల్ని ఇలానే చూశాం. అయితే.. పొన్నియన్ సెల్వన్‌లో ఓ కొత్త మణిరత్నం కనిపించబోతున్నాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మూడు భాగాలుగా తెరకెక్కబోతోంది. తొలి భాగం పూర్తయ్యి విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు టీజర్‌ని వదిలారు. ముందు నుంచీ ఇదో యుద్ధ నేపథ్య కథ అని చెబుతూనే ఉన్నారు. చెప్పినట్టే… టీజర్ అంతా యుద్ధ బీభత్సమే. గుర్రాలు, ఏనుగులు, కత్తులు, దాడులు, ప్రతి దాడులూ… ఇలానే సాగింది. విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాష్ రాజ్… ఇలాంటి దిగ్గజాలంతా ఈ సినిమాలో ఉన్నారు. మిగిలిన వాళ్లంతా ఏమో గానీ, చాలా కాలం తరవాత ఐష్ మళ్లీ తెరపై కనిపించింది. ఇద్దరు సినిమాలో ఎంత ముచ్చటగా, మురిపెంగా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది. ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారన్న సంగతి ప్రతీ ఫ్రేములోనూ తెలుస్తూనే ఉంది. అయితే… ఈ టీజర్లో కథా నేపథ్యం, థీమ్ సరిగా అర్థం కాలేదు. బహుశా.. ట్రైలర్ లో చెబుతారేమో..? మొత్తానికి మణి మర్క్కి దూరంగా, ఓ కొత్త మణిరత్నంని ఆవిష్కరించే చిత్రంగా… పొన్నియన్ సెల్వన్ ఉండబోతోందన్న విషయం స్పష్టమవుతోంది. మణిరత్నం అభిమానులంతా… జాతర చేయడానికి సిద్ధం కావాల్సిందే.