అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తునన తొలి ప్లీనరీ.. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలవడానికి మార్గాన్ని దిశానిర్దేశం చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్న ప్లీనరీ తొలిరోజు దారి తప్పింది. పూర్తిగా విజయమ్మ రాజీనామా అంశమే డామినేట్ చేసింది. అసలు విజయమ్మ వస్తారా రారా అన్న సందేహంలో ఆమె జగన్తో కలిసి స్టేజ్ మీదకు వచ్చారు. మొదట ఆమె ప్రసంగించాల్సి ఉంది. అయితే జగన్ ప్రసంగించారు. తర్వాత విజయమ్మ ప్రసంగించారు. చూసి చదివినంత సేపు జగన్ను పొగుడుతూ.. చంద్రబాబును విమర్శిస్తూ.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ సాగిన ప్రసంగం .. సొంత మాటలు బయటకు వచ్చే సరికి మారిపోయింది. తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
దీంతో సభా వేదికపైనే కాదు.. ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం ప్రారంభమయింది. కారణం ఏదైనా ఆమె ఏ కారణం చెప్పినా చేయాల్సిన.. జరగాల్సిన విశ్లేషణలు జరిగిపోతాయి. ఇలా ఆమె రాజీనామా ప్రకటన చేయడం గురించి పార్టీ నేతలకు ముందుగానే తెలిసి ఉంటే అంత కంటే వ్యూహాత్మక తప్పిదం మరొకటి ఉండదు. చివరికి సొంత పార్టీ వాళ్లు కూడా ప్లీనరీ గురించి ఎవరూ మాట్లాడుకోరు. విజయమ్మ రాజీనామా గురించే మాట్లాడుకుంటారు. అదే జరిగింది. ఈ కారణంగా విజయమ్మ ప్రసంగం తర్వాత ఎవరు ప్రసగించినా పెద్దగా పట్టించుకోలేదు. భోజనాల తర్వాత ఎక్కువ మంది తిరుగుముఖం పట్టారు. తొలి రోజు ప్లీనరీ కేవలంప్రతినిధుల సభ మాత్రమే.
అయినా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వారంతా భోజనాలు చేసి వెనుదిరిగారు. అదేసమయంలో నిర్వహణ లోపాలు స్పష్టంగా బయట పడ్డాయి. ప్లీనరీ కిట్స్ కొన్ని మినీ వాహనాల్లో రాగానే కార్యకర్తలంతా ఎగబడి వాటిని తీసుకెళ్లిపోయారు. క్షణాల్లో అవి ఖాళీ అయిపోయాయి. చివరికి ప్లీనరీలో ఎవరేం ఎవరేం అన్నారో అనే దాని కంటే విజయమ్మ రాజీనామా హైలెట్ అయింది. అందుకే… సజ్జల విజయమ్మ వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారంటూ పాత పద్దతిలోనే వ్యాఖ్యానించుకొచ్చారు.