రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది ? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ టాపిక్ అయింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కేవలం రాష్ట్రపతి ఎన్నికల కోసమే ఆగిందన్న అభిప్రాయం వచ్చేలా కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. అది అయిపోయిన తరవాత పంజా విసురుతుందని చెబుతున్నారు. నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భిన్నమైన మార్గంలో వెళ్తున్నాయి. ఏపీ నుంచి దాదాపుగా అన్ని పార్టీలు బీజేపీ, ఎన్డీఏ అభ్యర్తి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది.
తెలంగాణలో అధికార పార్టీ బీజేపీతో ఢీ అంటే ఢీ అంటుంది. పైగా ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇప్పుడు బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేరికలతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల చిట్టా అంతా దగ్గర పెట్టుకుని ఇక దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడటమే మిగిలిందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల వరకూ డిస్ట్రబెన్స్ ఎందుకని ఆగిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు . రాష్ట్రపతి ఎన్నికలపై తమ పార్టీపై బీజేపీ గురి పెడుతుందని భావిస్తున్నారు.
అయితే విచిత్రంగా ఏపీలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది. పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతుగా ఉంటున్న వైసీపీ విషయంలో బీజేపీ ఎందుకు కఠినంగా ఉంటుందన్న చర్చ అందుకే జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటే తమకే నష్టమని కేంద్ర బీజేపీ వర్గాలు అంచనాకు వచ్చాయంటున్నారు. దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితితో పాటు దారుణంగా ఉన్న రాజ్యాంగ ఉల్లంఘనల కారణంగా మద్దతుగా ఉండటం కన్నా నిబంధనల ప్రకారం ఉంటే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. కేంద్రం రూల్స్ ప్రకారం వ్యవహరించినా అది ఏపీ సర్కార్కు శిక్షలాంటిదే అనుకోవచ్చంటున్నారు.
అయితే బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి.అంత దాకా ఎందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకే మద్దతు ప్రకటించిన జేఎంఎం పార్టీపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. నేరుగా సీఎం ఇంట్లోనే సోదాలు చేస్తున్నారు. అందుకే… బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే చేస్తుందని.. రాష్ట్రపతి ఎన్నికల్లాంటి ముహుర్తాలు పెట్టుకోదని వాదిస్తున్నారు.