వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాల్సిందేనని పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతతో రాజీ కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పులివెందులలో ప్రచారం జరుగుతోంది. ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ ఆఫర్ చేశారని.. కుటుంబ సన్నిహితుల ద్వారా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ సీటును ఇస్తామని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలు ఇలా పెట్టగానే అలా సోషల్ మీడియాలో ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే జగన్ పులివెందుల సీటు ఇస్తామంటున్నారని.. కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అలాంటి పరిస్థితి ఉంటుందని ఎవరూ నమ్మడం లేదు.
కానీ సునీతతో రాజీ కోసం తీప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం చెబుతున్నారు. ఓ వైపు ఆమె టీడీపీలో చేరుతారని కడప నుంచి పోటీ చేస్తారని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే ఆరోపించారు. సజ్జల ఏదైనా సమాచారం ఉండి అలా అన్నారో లేకపోతే ఆమెపై రాజకీయ పరమైన ఆరోపణలు చేసి.. వివేకా హత్యకేసు తీవ్రతను తగ్గించడానికి అలా చేశారో స్పష్టత లేదు. కానీ ఒక వేళ అదే నిజం అయితే వైఎస్ కుటుంబంలో నిలువునా చీలిక వస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
జగన్ వైపు నుంచి తల్లీ, చెల్లి దూరం జరగడంతో ఇప్పుడు బంధువుల్లోనూ చాలా వరకూ జగన్కు మద్దతు కొరవడింది. కడప జిల్లాలోని రాజకీయ బంధువుల్లోనూ ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ సునీత టీడీపీ వైపు నుంచి పోటీ చేయకుండా… కేసు విషయంలో మరీ దూకుడుగా ఉండకుండా ఉండేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వైఎస్ సునీతకు రాజకీయాలపై అసలు ఆసక్తి లేదని ఆమెకు ఎవరు సీటు ఆఫర్ చేసినా తిరస్కరిస్తారని తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలనేదే వారి పోరాటమని .. సునీత సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు.