టెక్నాలజీ పెరుగుతూ పోతోంది. అందుబాటులో ఉన్న సాంకేతిక నైపుణ్యం వాడుకొంటే అత్యుత్తమ ఫలితాలొస్తాయి. హాలీవుడ్ సినిమా చేసేది అదే. అందుకే అక్కడ అన్ని అద్భుతాలు సాధ్యం అవుతాయి. వాటిని ఒడిసిపట్టుకొనే దిశగా మనవాళ్లూ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. పైగా… తెలుగులోనూ బడ్జెట్లు పెరుగుతున్నాయి. కావల్సిన సాంకేతికతను దిగుమతి చేసుకోవడానికి వెసులు బాటు దొరుకుతోంది. ప్రాజెక్ట్ కె విషయంలో ఇదే జరిగింది.
ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల పైమాటే. ఇదో ఫాంటసీ చిత్రం. ప్రేక్షకుల్ని ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే కథ. అందుకే కొత్త రకం టెక్నాలజీని వాడుతున్నారు. ఈ సినిమా కోసం ఆరి అలెక్సా 65 అనే కెమెరాని వాడుతున్నారు. అవెంజర్స్, గాడ్జిల్లా, కింగ్ కాంగ్ లాంటి సినిమాలకు వాడిన ఖరీదైన కెమెరా ఇది. దీని విలువ రూ.8 కోట్ల పైమాటే. హై ఎండ్ మోషన్ పిక్చర్స్కి క్యాప్చర్ చేసే సత్తా ఈ కెమెరాకు ఉంది. అలాగని ఈ కెమెరాని… అన్ని సీన్లకూ వాడేయరు. కేవలం కొన్ని షాట్ల కోసం మాత్రమే ఈ కెమెరా వాడతారు. ఈ కెమెరాని కొనుగోలు చేసి, వాడుతున్న తొలి ఇండియన్ సినిమా `ప్రాజెక్ట్ కె`నే. ఈ కెమెరాని ఉపయోగించడానికి కొంతమంది ఫారెన్ టెక్నీషియన్స్ని కూడా తీసుకొచ్చారు. `ప్రాజెక్ట్ కె` ఓ విజువల్ ఫీస్ట్ లా ఉండబోతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?