ఈమధ్య డిజిటల్, శాటిలైట్ హక్కులకు బాగా గిరాకీ పెరిగింది. వాటి వల్లే… కొన్ని సినిమాలు ఒడ్డున పడిపోతున్నాయి. గతవారం విడుదలైన ‘పక్కా కమర్షియల్’ ఫ్లాపైంది. అయితే.. నిర్మాతలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఎందుకంటే ఆ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు మంచి రేటుకే అమ్ముడైపోయాయి. థియేటరికల్ నుంచి పెద్దగా వసూళ్లు రాకపోయినా…నిర్మాత ఇబ్బంది పడలేదు. ఇప్పుడు `హ్యాపీ బర్త్ డే`కీ అంతే. మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన సినిమా ఇది. `మత్తు వదలరా`తో ఆకట్టుకొన్న రితేష్ రానా దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి, అగస్త్య, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తొలి రోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకొంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ వసూళ్లు ఆశించడం కష్టం. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలు గట్టెక్కేశారు. దానికి కారణం… డిజిటల్, శాటిలైట్ రైట్సే.
‘మత్తు వదలరా’ హిట్టవ్వడం వల్ల రితేష్ పై నమ్మకం పెరిగింది. దానికి తోడు.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చిత్రాలు బాగా ఆకట్టుకొన్నాయి. పైగా పబ్లిసిటీ కూడా బాగానే చేశారు. వెరైటీ డిబేట్లతో… రక్తి కట్టించారు. దాంతో సినిమాలో విషయం ఉందని అంతా నమ్మారు. అందుకే నాన్ థియేటరికల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడుపోయాయి. పెట్టుబడి మొత్తం వాటితోనే తిరిగొచ్చేసింది. ఇక.. థియేటరికల్ నుంచి ఎంతొచ్చినా లాభమే. కాబట్టి… నిర్మాతలు హ్యాపీగా సేఫ్ అయిపోయారు.