వైసీపీలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా చేయడానికి కారణం పార్టీలో చంద్రబాబులాంటి వారు ఉంటారనేనని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీలో ఈ అంశంపై విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో తిరుగులేని స్థానంలో ఉన్న జగన్పై ఎవరు తిరుగుబాటు చేస్తారని .. ఆ స్థాయి ఎవరికి ఉందని గుసగుసలాడుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ తరహాలోనే సీఎం జగన్ కూడా ఎవర్నీ దగ్గరకు రానీయరు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఉండవు. దీంతో వారిలో అసంతృప్తి ఉందని చెబుతున్నారు.
మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితుల నుంచి ఏక్ నాథ్ షిండే పుట్టారు. నిజానికి ఆయన బీజేపీ మద్దతివ్వకపోతే అంత సాహసం చేసేవారు కాదు. బీజేపీ అలాంటి సాయం చేస్తుందన్న సమాచారం ఉండటంతోనే జగన్ శాశ్వత అధ్యక్షుడి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇటీవల కొంత మంది సీనియర్లు తరచూ ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారన్న ప్రచారం జరిగింది. అలాంటి నేతలు కొంత మంది నేతలు ప్లీనరీ వేదికపై ఏడ్వడం కూడా వైసీపీ అగ్రనాయకత్వం దృష్టిలో పడింది.
దీనిపై స్పష్టమైన సమాచారం ఉండటంతో పార్టీ తమ చేతుల్లో నుంచి వెళ్లకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. అయితే పార్టీని చీల్చాలని బీజేపీ లేదా.. వైసీపీ సీనియర్లే అనుకుంటే.. ఇలాంటి పదవులు .. తీర్మానాలు ఏ మాత్రం ఉపయోగపడవని రాజకీయ పరిణామాలు ఇప్పటికే అనేక సార్లు నిరూపించాయి. ఇప్పటి వరకూ చూస్తే వైసీపీలో తీవ్రమైన సంక్షోభమే ఉందని జగన్, సజ్జల అంగీకరించినట్లయిందన్న వాదన తాజా పరిణామాలతో వినిపిస్తోంది. గతంలో బీజేపీ మౌత్ పీస్ లాంటి రిపబ్లిక్ చానల్ వైసీపీలో తిరుగుబాటు రాబోతోందని ప్రకటించారు. అది త్వరలో నిజమవుతుందని వైసీపీ అగ్రనాయత్వం భయపడుతోందని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు.