వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్నే నమ్ముకోవాలని టీఆర్ఎస్ వ్యూహం ఖరారు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ సారి టీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణ విలన్ గా బీజేపీ ఉండనుంది. వచ్చే ఎన్నికల్లో ఏ అంశంపై పోటీ చేయాలన్నదానిపై ఇప్పటి వరకూ టీఆర్ఎస్ రకరకాల సమీకరణాలపై కసరత్తు చేసింది. దళిత కార్డు.. అభివృద్ది .. ఇలా చాలా ట్రై చేశారు. కానీ ఏదీ వర్కవుట్ అవుతున్నట్లుగా క్లారిటీ రాలేదు. ఓ సారి రైతు అజెండాను హైలెట్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే అదీ వర్కవుట్ కాలేదు. దీంతో కేసీఆర్ ఇప్పుడు తీవ్రంగా ఆలోచించి పాత మార్గంలోనే పయనించాలని నిర్ణయించారు.
టీఆర్ఎస్ అనే పార్టీకి పునాది తెలంగాణ సెంటిమెంట్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ .. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్న ఊపులో విజయం సాధించింది. రెండో సారి గెల్చినప్పుడు సెంటిమెంట్ లేదనుకున్నారు. కానీ అప్పటి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. కేసీఆర్‌తో తానే పోటీపడుతున్నట్లుగా ప్రచారం చేయడంతో కేసీఆర్ ఆ అస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేవు. చంద్రబాబు లేరు. ఏపీ రాజకీయ పార్టీలు లేవు. మరి సెంటిమెంట్ ఎలా ? .
తెలంగాణ ప్రజలు తాము వివక్షకు గురవుతున్నామని భావిస్తే సహించరు. కచ్చితంగా ఇదే పాయింట్ పట్టుకున్న కేసీఆర్ ఆంధ్ర పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం చేశారని ఉద్యమాన్ని నిర్మించగలిగారు. ఇప్పుడు ఆంధ్ర అంశం తెలంగాణలో లేదు కాబట్టి… సెంటిమెంట్ కోసం కేంద్ర పాలకుల్ని చూపించాలని కేసీఆర్ వ్యూహం అమల్లో పెట్టినట్లుగా భావిస్తున్నారు. కొంత కాలంగా తెలంగాణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు ఇదే అజెండాగా టీఆర్ఎస్ రాజకీయం ఉండే అవకాశం ఉంది.