రూ.300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నానని ఆమధ్య కృష్ణవంశీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టుపై కూడా వంశీ బాగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వంశీ ఎంచుకొన్న నేపథ్యం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన ఓ సుదీర్ఘ మైన వెబ్ సిరీస్‌గా మలచబోతున్నారు. ఈ విషయాన్ని వంశీనే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ పోరాటాన్ని.. సినిమాలుగా తీశారు గానీ, వెబ్ సిరీస్‌లుగా మలచలేదు. వంశీ ఇప్పుడు ఆ ప్రయత్నం చేయబోతున్నాడు. తెలంగాణ చరిత్రలో చాలా అంశాలున్నాయి. అవన్నీ విడమరచి చెప్పబోతున్నాడు కృష్ణవంశీ. దీన్ని 5 సీజన్లుగా రూపొందించే అవకాశం ఉంది. ఒక్కో సీజన్లోనూ 10 ఎపిసోడ్లు ఉంటాయి. అంటే.. 50 ఎపిసోడ్లు. కాబట్టి.. ప్రతీ చిన్న విషయాన్నీ కూలంకుశంగా పొందుపరిచే వీలుంది. తెలంగాణ చరిత్ర గురించి, ఇక్కడి వీరుల గురించి తెలుసుకోవడానికి వంశీ ఇప్పుడు తీవ్ర కసరత్తు చేస్తున్నాడట. ఇందుకోసం చరిత్ర కారుల్ని కలుసుకొని, వివరాలు సేకరించే పనిలో ఉన్నాడు. వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. త్వరలోనే `అన్నం` అనే సినిమాని తెరకెక్కిస్తారు. ఆ తరవాతే… ఈ భారీ ప్రాజెక్టు ఉండొచ్చు.