జనసేన పార్టీ రాజకీయ వ్యూహాల్లో గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. అవసరం లేపోయినా ఎన్నికలైన తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు.. దానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పడం లేదు. దానికి తోడు నాగబాబు వంటి వారు నేరుగా మోదీనే అవమానిస్తున్నారు. పేరుకు పొత్తులో ఉన్నా.. బీజేపీ -జనసేన కలిసి ఉన్నట్లుగా అసలు కనిపించవు. కలిసి చేసిన పోరాటాలు కానీ.. వివిధ అంశాలపై అభిప్రాయాలు కానీ.. ఒకేలా ఉండటం లేదు.
పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కల్యాణ్ నిర్ణయాలు తేడాగానే ఉన్నాయి. మొదటి ఎన్నికల్లో అసలు పోటీనే చేయకుండా.. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లకు ఏమైందో.. అనూహ్యంగా టీడీపీ పైన దాడి మొదలుపెట్టారు. 2019 లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి… ఆరుశాతం ఓట్లు సాధించారు. 2019 కు ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని..ఆంధ్రకు పాచిపోయిన లడ్డూలు పంపారని బీజేపీపై విరుచుకుపడ్డారు. కానీ వెంటనే ఆ పార్టీతో పొత్తు అన్నారు. ఇప్పుడు మళ్లీ మూడు ఆప్షన్లంటున్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోలేకపోతున్నారు. దాని కోసం వేయాల్సిన అడుగుల విషయంలోనూ స్పష్టత ఉండటం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రాజకీయ పిల్ల చేష్టలన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. ఎందుకు ఓ పార్టీని విమర్శిస్తున్నారో.. ఎందుకు మళ్లీ కలుస్తున్నారో చెప్పలేకపోతున్నారు. నాడు టీడీపీని ఏ కారణంతో విమర్శించారో అవన్నీ అవాస్తవాలేనని శేఖర్ రెడ్డి దగ్గర్నుంచి అమరావతి వరకూ అన్ని విషయంల్లో స్పష్టమయింది. ఇప్పుడు రాజకీయ అడుగుల విషయంలోనే అదే అవగాహన లేని తనం కనిపిస్తోంది.
జనసేన ఏపీ రాజకీయాల్లో కీలకం. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు కీలకం అవుతాయి. ఇతర పార్టీల సంగతేమో కానీ ముందు తమ ఓట్లనుసీట్లుగా మార్చుకోవాలి. లేకపోతే ఉనికికే దెబ్బపడుతుంది. ఈ సారి పవన్ కూడా గెలవకపోతే.. ఇక పార్టీకి భవిష్యత్ ఉండదు. అందుకే పిల్లతనం వ్యూహాలు మాని నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది.