ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్నారు. ఆమె తమకు మద్దతు ప్రకటించిన వైసీపీ ఓటర్లతో సమావేశం అవుతారు. కానీ ఆ సమావేశానికి సీఎం జగన్ వెళ్లడం లేదు. నేరుగా రాష్ట్రపతి అభ్యర్థి ముర్మునే సీఎం ఇంటికి వెళ్తారు. ఎలా చూసినా రాష్ట్రపతిగా ముర్ము గెలుపు ఖాయం. కాబోయే రాష్ట్రపతి సీఎం జగన్ నివాసానికి వెళ్లడం వైసీపీ వర్గాల్లోనూ ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే బీజేపీ వర్గాల్లో మాత్రం తేడాగా మాటలు వినిపిస్తున్నాయి.
అసలు రాష్ట్రపతి ఎన్నికల్లో తాము వైసీపీ మద్దతు అడగలేదని కేంద్ర నాయకులు కూడా ఎవరూ సంప్రదించలేదని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. వైసీపీనే తనంతటకు తాను మద్దతు ప్రకటించిందని చెప్పుకొస్తున్నారు. తమకు వైసీపీ అంటరానిపార్టీనే అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తూంటే అలా ఎవరికీ అనిపించడం లేదు. సీఎం జగన్ దావోస్ నుంచి వచ్చిన ఒక్క రోజుకే ప్రధాని అపాయింట్మమెంట్ లభించింది. వెంటనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించి వచ్చారన్న ప్రచారం జరిగింది.
ఆ తర్వాత బహిరంగంగా ఎవరూ వైసీపీని మద్దతు అడగలేదు. సాధారణంగా బీజేపీ ఇతర పార్టీల మద్దతు అవసరం అయితే వారి వద్దకు ప్రతినిధుల్ని పంపి చర్చిస్తుంది. వైసీపీ వద్దకు అలాంటి ప్రతినిధుల్ని పంపలేదు. అందుకే బీజేపీ నేతలు తాము వైసీపీని రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అడగలేదని చెబుతున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం వేరుగా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిని నేరుగా జగన్ ఇంటికి వెళ్తున్నా రు. బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల వ్యూహకర్తలు అలా డిసైడ్ చేయకపోతే ఆమె అలా వెళ్లే చాన్స్ లేదు.
ఏపీ బీజేపీ నేతలు తాము వైసీపీ సాయం తీసుకోవడం లేదని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. మాటల్లో అదే చెబుతున్నారు. కానీ అదంతా ప్రజల కోసమే అన్నట్లుగా ఉంది వ్యవహారం. అంతర్గతంగా మాత్రం దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు.