ఏపీ ప్రభుత్వం .. ఏపీ రాష్ట్రానికి ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదనుకుంటోంది. కేంద్ర ప్రాజెక్టు ఒక్కటీ అడగడం లేదు. ఇవ్వకపోయినా పట్టించుకోవడం లేదు. విభజన చట్టం ప్రకారం గత ప్రభుత్వం సాధించుకొచ్చిన కొన్ని ప్రాజెక్టులను కూడా ఇప్పుడు తరలిస్తూంటే సైలెంట్ అయిపోతోంది. ప్రస్తుతం పెట్రో వర్శిటీని కూడా తరలిస్తున్నట్లుగా ఢిల్లీ నుంచి సమాచారం లీకవుతోంది. విభజన చట్టం ప్రకారం పెట్రో వర్శిటీని ఏపీలో ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసి విశాఖలో ఏర్పాటుకు ఉత్తర్వులు తెచ్చింది.
స్థలం కూడా కేటాయించింది. కేంద్రం కొన్ని నిధులు కేటాయించింది. పనులు కూడా ప్రారంభమయింది. భూమి చదును చేసి ప్రహారి కట్టే పనులు ప్రారంభమయ్యాయి. అయితే కొంత కాలంగా ఆ పనులు ఆగిపోయాయి. ఏపీలో ఏ అభివృద్ధి పని జరగడం లేదు కాబట్టి అది మామూలే అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. అసలు పెట్రో వర్శిటీని ఏపీ నుంచి యూపీకి తరలించాలన్న నిర్ణయం ఉన్నత స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. ఈ మేరకు ఫైల్ కూడా శరవేగంగా ముందుకు కలుదుతోందంటున్నారు.
ఈ అంశంపై తమకు స్పష్టమైన సమాచారం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏదో ఓ ఓకారణం చెప్పి పెట్రో వర్శిటీని తరిలిస్తే.. సరే అనడం మినహా ఏపీ ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఏపీ ప్రజల వాయిస్ అయిన ప్రభుత్వమే మాట్లడాకపోతే కేంద్రం మాత్రం తీసుకెళ్లిపోకుండా ఉంటుందా ? మొత్తంగా విభజన చట్టం ప్రకారం వచ్చిన సంస్థలు కూడా వెనక్కి పోతూండటమే ఏపీకి అసలు విషాదం.