హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారడం సహజమే. ఇప్పుడు ప్రతీ హీరోకీ.. ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఈమధ్య హీరోయిన్లు కూడా ప్రొడక్షన్ వైపు దృష్టి పెడుతున్నారు. తక్కువ బడ్జెట్లో పూర్తయే చిత్రాలకు పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ పద్ధతి లాభసాటిగానే ఉంది. అందుకే సాయి పల్లవి సైతం… ఈ దిశగా ఆలోచిస్తోంది. తనకూ చిత్ర నిర్మాణం వైపు అడుగులేయాలన్న ఆసక్తి ఉందని చెప్పుకొచ్చింది.
తను నటించిన ‘గార్గి’ వచ్చే నెలలో విడుదల అవుతోంది. అయితే ఈలోగానే ప్రమోషన్లు మొదలెట్టేసింది సాయి పల్లవి. ఈ సినిమాని ప్రమోషన్ బాధ్యతల్ని తానే స్వయంగా నెత్తిమీద వేసుకొంది. తమిళంలో సూర్య, జ్యోతికలకు ముందే ఈ సినిమా చూపించింది. ఈ సినిమా చూసిన సూర్య చాలా ఇంప్రెస్ అయ్యాడు. తమిళంలో ఈ సినిమాకి తానే సమర్పకుడిగా వ్యవహరిస్తానని మాటిచ్చాడు. తమిళంలో సూర్య పేరు మీదే ఈ సినిమా విడుదల అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని రానా సమర్పిస్తున్నాడు. ”సమర్పకురాలిగా నా పేరు వేస్తామని నిర్మాతలు చెప్పారు. నా సినిమాని నేనే సమర్పించుకోవడం ఏమిటని వద్దు అన్నాను. ఎప్పుడైనా నా దగ్గరకు ఓ మంచి స్క్రిప్టు వచ్చి, ఈ సినిమాని నేనే నిర్మించాలని బలంగా అనిపిస్తే తప్పకుండా పూర్తి స్థాయి నిర్మాతగా బాధ్యత వహిస్తా. ఎందుకంటే ఈ పరిశ్రమ నాకు చాలా ఇచ్చింది. నేను కూడా ఏదో ఓ రూపంలో తిరిగి ఇవ్వాలనుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.