కోహ్లీ… ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్. క్రికెట్లో ఉన్న అన్ని బ్యాటింగ్ రికార్డుల్నీ బద్దలు కొట్టగల సత్తా కోహ్లీకి ఉందని మాజీలు శ్లాఘిస్తుంటారు. సచిన్ కూడా `నా రికార్డులన్నీ కోహ్లీ వశమవుతాయి` అని జోస్యం చెప్పాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మెట్ ఏదైనా సరే, చెలరేగిపోవడం కోహ్లీ స్టైల్. అయితే ఇంత దిగ్గజ ఆటగాడు ఇప్పుడు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. కోహ్లీ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ చూసి చాలాకాలమైంది. ముఖ్యంగా తనకు తిరుగులేని టీ20లో చేతులెత్తేస్తున్నాడు. యువతరం అంతా దూకుడుగా ఆడుతున్న ఇలాంటి తరుణంలో కోహ్లీ తడబడడం ఆశ్చర్యాన్నికలిగిస్తోంది.
ఐపీఎల్ లో కోహ్లీ బ్యాటింగ్ రికార్డు అద్భుతం. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు అనేకం. అయితే ఈ ఐపీఎల్ లో తను ఘోరంగా విఫలం అయ్యాడు. 16 మ్యాచుల్లో కేవలం 341 పరుగులే చేశాడు. బ్యాటింగ్ సగటు 23 లోపే. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా తన వైఫల్యం కనిపిస్తోంది. కీలకమైన 5 వ టెస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. చివరి రెండు ట్వీ 20లలో తన మొత్తం స్కోరు 12 పరుగులు. కోహ్లీ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన హుడా… అంతకు ముందు ఐర్లాండ్ తో మ్యాచ్‌లో మెరుపు వేగంతో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్ తో తొలి టీ 20లోనూ రాణించాడు. అలాంటి హుడాని కాదని కోహ్లీకి అవకాశం ఇస్తే… రెండు మ్యాచ్‌లలోనూ విఫలం అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హుడా, దినేష్ కార్తీక్ ఇలా.. అందరూ విజృంభిస్తున్న ఈ తరుణంలో.. కోహ్లీ విఫలం అవ్వడం జట్టులోని అతని స్థానాన్ని ప్రశ్నార్థకంలో పడేస్తోంది. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ మొదలవ్వబోతోంది. ఈ జట్టులో కోహ్లీ ఉంటాడా, లేడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం ప్రపంచకప్‌లో కోహ్లీ పేరు లేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాజీలు కూడా కోహ్లీకి కొన్నాళ్ల పాటు విశ్రాంతి ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వెస్టీండీస్ తో టీ 20 సిరీస్ జరగబోతోంది. ఇందులో కోహ్లీ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాను రాణిస్తేనే వరల్డ్ కప్‌లో చోటు దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితి కోహ్లీకి ఇప్పటి వరకూ ఎదురు కాలేదు. మరి… ఈ ఛాలెంజ్ ని కోహ్లీ ఎలా తీసుకుంటాడో..?
మరోవైపు రోహిత్ శర్మ మాత్రం కోహ్లీని వెనకేసుకొస్తున్నాడు. ఆటగాడిగా కోహ్లీ ప్రతిభని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ కైనా.. ఫామ్ కోల్పోవడం సహజమని, తాను ఫామ్ లోకి వస్తే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో తమకు తెలుసని… కోహ్లీకి అండగా మాట్లాడుతున్నాడు.