ఏపీలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ వైపే అని మరోసారి నిరూపితమయింది. టీడీపీ కూడా బీజేపీ కూడా అడగకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతును ద్రౌపది ముర్ముకే ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గిరిజన తెగకు చెందిన వారు కావడం, దేశంలోనే తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉండడం వల్ల ఆమెకు తాము మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. వైసీపీ కూడా ఇదే కారణం చెబుతోంది. అయితే టీడీపీకి ఉన్న ఓట్ల విలువ అత్యల్పం. మొత్తం ఓటింగ్‌లో అరశాతం కూడా లేవు. దాదాపుగా ఆరు శాతం ఓట్లు ఉన్న వైసీపీ ఏపీ కోసం ఎలాంటి షరతులు.. చర్చలు లేకుండానే బీజేపీ అభ్యర్థికి మద్దతు పలికింది. ఎలాంటి ప్రభావవంతమైన ఓట్లు లేని టీడీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకి వచ్చేది.. పోయేది ఏమీ లేదు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా గెలిచే పరిస్థితి లేదు. ఈ కారణంగా అనవసరంగా బీజేపీకి వ్యతిరేకం అనిపించుకోవడం ఎందుకని గిరిజన అభ్యర్థి కాబట్టి మద్దతు అనే కాన్సెప్ట్‌తో టీడీపీ ముందుకెల్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.