ఏపీ బీజేపీ నేతలకు ఏమీ అర్థం కావడం లేదు. వైసీపీని వ్యతిరేకిస్తే ఓ తంటా.. లేకపోతే మరో తంటా. రెండు వైపుల నుంచి వారికి అక్షింతలు పడుతున్నాయి. తాజాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతును కేంద్ర నాయకులు కూడా అడగలేదని వైసీపీనే మద్దతిచ్చిందని బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ చేసిన చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్యకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. తాము వైసీపీ మద్దతు అడిగామని.. ద్రౌపది ముర్ము నామినేషన్‌కు రావాలని ఆహ్వానించామని ఢిల్లీలో తెలిపారు. సత్యకుమార్ మాటలు ఆయన వ్యక్తిగతమని తేల్చారు.
దీంతో ఢిల్లీలో కాస్త పలుకుబడి ఉన్న సత్యకుమార్ గాలి తీసేసినట్లయింది. ఆయన వైసీపీకి వ్యతిరేకంగా కాస్త గట్టిగా మాట్లాడే నాయకుడు. నేరుగా ఢిల్లీ స్థాయి పదవి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో మిగతా బీజేపీ నేతలతో పోలిస్తే ఆయనకూ ఉన్న ప్రజాదరణ తక్కువే. కానీ పలుకుబడి ప్రకారం చూస్తే ఆయన మిగతా వారి కన్నా ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తే. అలాంటి నేతకే షెకావత్ కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు హైకమండ్ దృష్టికి తీసుకెళ్లి తమను తక్కువ చేస్తున్నారని .. ఖండించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
ఈ కోరిను బీజేపీ హైకమాండ్ అంగీకరించింది. దీంతో ఏపీ బీజేపీ నేతలకు మరోసారి షాక్ తప్పలేదు. ఒక వేళ వైసీపీని సమర్థించినట్లుగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది.. వ్యతిరేకిస్తే ఢిల్లీ నుంచి ఖండనలు వస్తున్నాయి. అందుకే ఏపీ బీజేపీ నేతలకు ఏమీ పాలుపోని పరిస్థితి.