రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద లక్ష్యాలనే పెట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ దగ్గర మంచి పలుకుబడి సాధించిన ఆయన నెలకోసారి అయినా టూర్‌కు ఆహ్వానిస్తారు. గతంలో వరంగల్ పర్యటన అప్పుడే మరోసారి వస్తానని… ప్రకటించారు. ఈ సారి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభను ఖరారు చేశారు. గతంలో రైతులకు డిక్లరేషన్ ప్రకటించినట్లుగా ఈ సారి నిరుద్యోగు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీతో ప్రకటింప చేసే అవకాశ ఉంది.
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకటించడం కన్నా ముందుగానే వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించి.. వాటిని ప్రజల్లో చర్చకు పెడితే ఫలితం ఉంటుందని నమ్ముతున్నారు. అందులో భాగంగానే రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండను నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడటం లేదు. ప్రతి నియోజకవర్గంలో నేతలు ఎలా రచ్చబండ నిర్వహిస్తున్నారో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుటున్నారు. నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కార్‌పై రైతులతో పాటు నిరుద్యోగుల్లోనూ ఎక్కువ అసంతృప్తి ఉందన్న వాదన ఉంది. ఎనిమిదేళ్ల కాలం నియామకాలు పెద్దగా లేవు. ఇటీవలే ఎనభై వేల పోస్టుల భర్తీని ప్రకటించినా వాటి ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఎన్నికల్లోపు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పడం కష్టంగా మారింది. దీంతో నిరుద్యోగులకు భారీ వరాలను నిరుద్యోగ డిక్లరేషన్‌లో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.