అప్పులు ప్రధాని మోదీ ఇస్తున్నారు.. జగన్ పంచుతున్నారని ఘనత వహించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటిచుకున్నారు. జగన్ మీట నొక్కుడులో వాటా తమకూ ఉందని ఆయన భావన. వాటా కోసం ఆయన ఇలా అంటున్నారు కానీ… అసలు మోదీ ఇస్తోంది.. జగన్ తీసుకుంటోంది ఏమైనా సొంత సొమ్ములా ? అనేది ఇక్కడ అసలు కీలకమైన విషయం. జగన్‌కు అడ్డగోలుగా అప్పులు ఇస్తున్నారని.. కాగ్‌కు వివరాలు సమర్పించకపోయినా .. వేల కోట్ల లెక్కలు గోల్ మాల్ అవుతున్నాయని కాగ్ లాంటి సంస్థలు హెచ్చరికలు వస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణం అవుతున్నాయి.
బీజేపీకి మద్దతిస్తున్నాం కాబట్టే అప్పులొస్తున్నాయంటున్న వైసీపీ ఎంపీలు !
బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాము కాబట్టే నిధులు వస్తున్నాయని ఇందులో దాపరికం ఏమీ లేదని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. ఆ పార్టీకి అడిగినప్పుడల్లా మద్దతు ఇస్తున్నామంటున్నారు. అదే సమయంలో వైసీపీకి అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నామని జీవీఎల్ వంటి వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కేంద్రం.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిలో అదనంగా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. ఇంకా తక్కువే ఇస్తున్నారు. వివిధ రకాల గ్రాంట్లు బాగా తగ్గిపోయాయి. కానీ అప్పులు మాత్రం అసువుగా ఇస్తున్నారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రజలపై భారమే.
కేంద్రం అప్పలిచ్చినా ఏపీ ప్రజలే కట్టాలి !
కార్పొరేషన్ల పేరుతో మందుబాబుల్ని కూడా తాకట్టు పెట్టి వేల కోట్లు తీసుకున్నారు. ఆర్బీఐ దగ్గర ప్రతి మంగళవారం అప్పు తీసుకోవాల్సిందే. ఇవన్నీ వడ్డీలతో సహా ఏపీ ప్రభుత్వం కట్టాల్సిందే. ఏపీ ప్రభుత్వం అంటే ఇవాళ జగన్ రేపు మరొకరు. అయితే ఎవరూ వ్యక్తిగతంగా బాధ్యులుగా ఉండరు. ప్రజలే కట్టాలి. అప్పులు చేసి అనుత్పాదక వ్యయం చేస్తే ప్రభుత్వం మారినా మారకపోయినా ఆ భారం ప్రజలపైనే పడుతుంది. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి కట్టాలి. ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోంది.
అప్పులు పుట్టని పరిస్థితి వస్తే ?
రాజకీయ ప్రయోజనాలు.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మొత్తం ఏపీ ఆర్థిక వ్యవస్థను కొన్ని రాజకీయ పార్టీలు దిగజారుస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది. దీని ద్వారా అప్పులు లభించించినంత కాలం బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిస్థితి తిరగబడుతుందో అప్పుడు .. ప్రజలు కూడా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి వరకూ తెచ్చుకోకుండా ప్రజలు గుర్తిస్తే.. పాలకులు జాగ్రత్త పడతారు. లేకపోతే.. !