కేటీఆర్ వల్లనే పార్టీకి దూరమయ్యామని అనుకునే కొంత మంది నేతలు ఎక్కడైనా కనిపిస్తే .. కేటీఆర్ మొహం తిప్పుకోవడం లేదు. వారు మొహం తిప్పుకున్నా తానే వెళ్లి పలకరిస్తున్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్‌కు ఓ ఇమేజ్ ఉంది. ఆయనకు కొంచెం పొగరని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కేటీఆర్ పూర్తిగా మారిపోయింది. పార్టీ వ్యవహారాల్లో తన మాట వినకుండా దూరంగా ఉన్న వారిని.. పార్టీ వీడి పోయిన వారిని కూడా ఇప్పుడు ఆయన ఆదరంగా చూస్తున్నారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పార్టీ లైన్‌కు విరుద్ధంగా వెళ్తున్నారని కేటీఆర్ చాలా సార్లు ఆయన వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల్లో ఆయన ప్రమేయం లేకుండా చేశారు. దీనికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో చేరడమే. చాలా రోజుల పాటు జూపల్లిని పట్టించుకోని కేటీఆర్ ఇటీవల నాగర్ కర్నూలు వెళ్లినప్పుడు ఆయన ఇంటికి వెళ్లి మరీ పలకరించారు. అంతర్గత రాజకీయాలపై చర్చించారు. తాజాగా ఆయన మాజీ ఎంపీ వివేక్ ఓ కార్యక్రమంలో ఎదురుపడితే ఆదరంగా మాట్లాడారు. ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి కాసేపు చర్చలు జరిపారు.
నిజానికి కేటీఆర్ కారణంగానే వివేక్ టీఆర్ఎస్ను వీడి బీజేపీలోచేరాల్సి వచ్చింది. పెద్ద పల్లి టిక్కెట్‌ను చివరి క్షణంలో వివేక్‌కు నిరాకరించారు. దీనంతటికి కారణం కేటీఆర్ అని.. తన అనుచురుడు సుమన్ కోసం ఇలా చేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. బీజేపీలో చేరి టీఆర్ఎస్ నేతలపై ఆకర్ష్ ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో కేటీఆర్ చనువుగా మాట్లాడటం చూసేవారిని కూడా ఆసక్తి రేకెత్తించింది. వచ్చే ఎన్నికల కోసం కేటీఆర్ దూరమైన వారందర్నీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఇలా మారిపోయారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.