వైసీపీపై పోరాడటమే తన దినచర్యగా మార్చుకున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పుడు ఆ పార్టీనే కొత్త పని అప్పగించింది. ప్లీనరీలో జగన్ను జీవిత కాల అధ్యక్షుడిగా ప్రకటించడంతో రఘురామకు ఒక్క సారిగా ఒళ్లు విదిల్చుకున్నారు. అంత కంటే చేయడానికి పనేమి దొరుకుతుందని ఆయన ఫీలయ్యారు. అలా ప్రకటించుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఢిల్లీలో హడావుడి ప్రారంభించారు. ఈసీ వర్గాలను కలిశారు. త్వరలో మరిన్ని రాజ్యాంగ సంస్థలను కలిసి జగన్ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పాలనుకుంటున్నారు.
అయితే ఆయనను అడ్డుకోవాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపైనే పడింది. తిట్లు, బూతులతో సాధ్యం కాదని తేలిపోయింది . ఇప్పుడు రఘురామ ఈ అంశంపై ఢిల్లీలో చేసే ఫిర్యాదులకు ఆయన కౌంటర్ ఇవ్వాల్సి ఉంది. దీంతో విజయసాయిరెడ్డి మొదటగా జగనే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదని.. గతంలో డీఎంకే అధినేతగా కరుణానిధి కూడా శాశ్వత అధినేతగా ప్రకటించుకున్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే డీఎంకే రాజ్యాంగంలో ప్రధానకార్యదర్శి అత్యున్నత పదవి. ఆ పదవిని కూడా జీవితాంతం తానేఉండాలని ఆయన తీర్మానం చేయించుకోలేదని .. ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికవుతూ వస్తున్నారని రఘురామ అంటున్నారు.
కరుణానిధి ఇలా శాశ్వత అధ్యక్షునిగా నియమితుడై ఉంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని విజయసాయికి సవాల్ విసిరారు. అందర్నీ సూట్ కేసులతో కొడదామని అనుకోవద్దని ఆయన సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే… రఘురామకృష్ణరాజు మరికొన్ని రోజుల పాటు తమ పార్టీ శాశ్వత అధ్యక్షుడి కొత్త పదవి ఊడగొట్టేదాకా విశ్రమించేలా లేరని ఢీల్లీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.