తెలంగాణలో “సర్వేయర్లు” తమ పని ప్రారంభించారు. పట్టుమని పది మంది ఉద్యోగుల్ని మెయిన్టెయిన్ చేయని కొంత మంది… రాజకీయ పార్టీలు ఎంత “విలువ” ఇస్తే అంత మేర శక్తి వంచన లేకుండా సర్వే రిపోర్టులు ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సీజన్ ప్రారంభమయింది. పీకే ఎన్ని సర్వేలు చేసినా అవి బయటకు రావు. టీఆర్ఎస్ అంతర్గతం. పీకే సర్వేల్లో తాము మెరుగ్గా ఉన్నామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు సీజనల్ “సర్వేయర్లు” కూడా తమ రిపోర్టులు బయటకు వదలడం ప్రారంభించారు.
సహజంగా ఇవి టీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. ఆరాపేరుతో ఓ సంస్థను నడుపుతున్న మస్తాన్ అనే వ్యక్తి తమ సంస్థ చేసిన సర్వే అంటూ మీడియా ప్రతినిధులకు ఓ రిపోర్ట్ షేర్ చేశారు. టీఆర్ఎస్కు ఏకపక్షంగా సీట్లు వేస్తే నమ్మరనుకున్నారేమోకానీ కాస్త తగ్గించారు. టీఆర్ఎస్, బీజేపీకి పోటాగాపోటీగా ఉన్నాయని… కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని నివేదిక ప్రకటించారు. ఉమ్మడిపది జిల్లాల్లో ఏడు జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య.. మూడు జిల్లాల్లో కాంగ్రెస్ , టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని చెప్పుకొచ్చారు.
గతంలో ఆరా మస్తాన్ టీఆర్ఎస్ కు అనుకూలంగా సర్వేలు అందించిన రికార్డు ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో.. హుజురాబాద్ ఉపఎన్నికల్లోనూఆయన అంచనాలు తప్పయ్యాయి. నిజానికి సర్వే చేయాలంటే.. పెద్ద నెట్ వర్క్ ఉండాలి. అలాంటిదేమీ లేకుండా లేకుండా నివేదికలు ఇచ్చేందుకు చాలా మంది రెడీ అయిపోతూంటారు. వాటిని పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సీజన్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.