పార్లమెంట్లో కొన్ని పదాల వాడకాన్ని నిషేధించారు. ఈ మేరకు బుక్లెట్ విడుదల చేశారు. ఆ బుక్‌లెట్‌లోని పదాలను వాడితే రికార్డుల నుంచి తొలగిస్తారు. అవన్నీ బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి విపక్షాలు చేసే విమర్శలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పదాల్లాంటివే. ‘జుమ్లాజీవి’, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, శకుని,- అప్మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, ‘స్నూప్‌గేట్’, అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు.
వివిధ సందర్భాల్లో దేశంలోని చట్ట సభలు, కామన్వెల్త్ దేశాల పార్లమెంట్లలో స్పీకర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను బుక్ లెట్లో చేర్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పదాలను వాడితే రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్ సభ, రాజ్య సభ అధిపతులకే ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. సభ్యుల నుంచి సరైన వివరణ, స్పందన లేకుంటే వాళ్లను సభ నుంచి బయటకి పంపిస్తారు.
ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎలాంటి పదాలతో విమర్శించాలోకూడా చెబుతారా అని.. విపక్షాలు మండి పడుతున్నాయి. అన్ పార్లమెంటరీ పదాల పేరుతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతి పక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం పోరాడేందుకు వచ్చే సమావేశాల్లో ఆ పదాలను ఉపయోగిస్తామని, వీలైతే తమను సభ నుంచి సస్పెండ్ చేయాలని సవాల్ చేస్తున్నారు. గతంలో ఆన్ పార్లమెంటరీ పదాలంటే పచ్చి బూతులు ఉండేవి. అలాంటివి అనువుగా వాడేస్తున్నారు. ఇప్పుడు మామూలు అవినీతి అనే పదం కూడా వాడొద్దని అంటున్నారు. అధికారపార్టీ సభ్యులకు మాత్రం సహజంగానే ఈ రూల్స్ వర్తించవు.