అన్న చెప్పాడంటే చెయ్యడంతే అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి బలం కలిగించే జగన్ ప్రభుత్వ తీరు ఉంది. జగన్ చేసే సమీక్షలన్నీ ఉత్త డొల్ల అని ప్రజలకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి.. ఆహా ఓహో అనిపించుకోవడం తప్ప.. ఒక్క పనీ జరగదని మరోసారి నిరూపితమవుతోంది. గత మూడేళ్ల నుంచి రోడ్లపై సప్రతి మంగళవారం సమీక్షలు చేసి అద్దాల్లాంటి రోడ్లు.. సాఫీగా సాగిపోదాం అని సాక్షిలో ప్రకటనలు కూడా ఇచ్చి చివరికి గుంతలు కూడా పూడ్చలేని దారుణమైన పరిస్థితికి దిగజారిపోయింది.
జూలై పదిహేనో తేదీలోపు ఒక్క గుంత ఉండవద్దని.. నాడు-నేడు అంటూ ఫోటోలు పెట్టాలని కూడా జగన్ ఆదేశించారు. ఒక్క గుంత పూడ్చకపోగా… ఇప్పుడు వర్షాలకు రాష్ట్రం మొత్తం రహదారులు దారుణంగా పాడైపోయిన పరిస్థితి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా కొంత దూరం ప్రయాణిస్తే.. సీఎం జగన్ను మనసులో ఏమనుకుంటారో అంచనా వేయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇంకా మాటలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తోంది. కానీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు.
కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. చెల్లించడం లేదు. కోర్టుకెళ్లిన వారికి మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పనులు చేసి కోర్టుకెళ్లి ఎందుకు పోరాడాలని వారనుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే వైసీపీ నేతలు కూడా కాంట్రాక్టులు చేయడం లేదు. ప్రభుత్వ కాంట్రాక్టులా వద్దే వద్దు అంటున్నారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు పనులు చేసి ఆర్థికంగా నష్టపోయారు. ఈ పరిస్థితి వల్ల జగన్ ఏం చెప్పినా చేయరని జగన్ నమ్మే పరిస్థితి ఏర్పడింది.