ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఓ పథకానికి మీట నొక్కే కార్యక్రమానికి వెళ్లారు. గతంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా హెలికాప్టర్లలో వెళ్లేవాళ్లు ముఖ్యమంత్రులు. తర్వాత రోడ్డు మార్గం చూసుకునేవారు. ఇప్పుడు సీఎం ఎక్కడికైనా ప్రత్యేక విమానం ఉపయోగిస్తున్నారు. అలా విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో వెళ్లారు. తిరుపతి నుంచి కార్యక్రమం ఏర్పాటుచేసిన వేదిక ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు. అక్కడికి ఎవరైనా వాహనాల్లో వెళ్తారు. కానీ అక్కడ సీఎంకు ఓ హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. ఆయన హెలికాఫ్టర్ లో వేదిక వద్దకు వెళ్లారు.
హవ్వ రేణి గుంట నుంచి తిరుపతిలో కార్యక్రమానికి వెళ్లడానికి హెలికాఫ్టరా అని అందరూ నోళ్లు నొక్కుకున్నారు. ఇలా నోళ్లు నొక్కుకోవడం ప్రజలకు అలవాటైపోయింది. తాడేపల్లి నుంచి గుంటూరుకు కూడా హెలికాఫ్టర్లు వాడేస్తున్నారు. కొద్ది రోజులు పోతే తాడేపల్లి నుంచి విజయవాడ ఎయిర్పోర్టుకూ ఓ హెలికాప్టర్ వాడే చాన్స్ ఉంది. సీఎం రోడ్డెక్కట్లేదని చెప్పడానికే ఇవన్నీ. సీఎం రోడ్లపైకి ఎందుకు రావడం లేదు.. అంటే. అసలు అవెక్కడున్నాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాను ఆ రోడ్లపై ప్రయాణం చేయలేనని ఆయన హెలికాఫ్టర్ వాడుతున్నారని విమర్శిస్తున్నారు. అది నిజమే కావొచ్చు.
జాతీయ రహదారులు మెరిసిపోతూంటే రాష్ట్ర రహదారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహణ లేక గుంతల మయంగా మారాయి. మూడేళ్ల నుంచి రోడ్ల మరమ్మతులకు పైసా ఖర్చు పెట్టలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు వాటిని పూర్తిగా నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. గోతులు పూడ్చినా… ఉండే చాన్స్ లేదు. నిజానికి ఆ గోతులు పూడ్చడానికి కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఆ గుంతల్లో పడి ఎన్నిప్రాణాలు పోతున్నాయో.. ఎన్ని వాహనాలు నాశం అవుతున్నాయో.. చెప్పడం కష్టం.
మౌలిక వసతులే రాష్ట్ర పరిస్థితిని చూపిస్తూ ఉంటాయి. కానీ ఏపీలో ఆ మౌలిక వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ప్రజలకు అవి అవసరం లేదని పాలకులు భావిస్తున్నారు.