Gargi Movie Review
మనం కొన్ని కథలు చెప్పలేం. కొన్ని విషయాల గురించి అస్సలు మాట్లాడుకోలేం. దురదృష్టం ఏమిటంటే.. చెప్పాల్సిన కథలు, చెప్పి తీరాల్సిన కథలు కూడా పక్కన పెట్టేస్తాం.కమర్షియల్ ముసుగులో.. కొట్టుకుపోతుంటాం. కానీ.. ఈ విషయంలో కొంతమంది తమిళ, మలయాళ దర్శకుల్ని, చిత్ర రూపకర్తల్నీ మెచ్చుకొని తీరాలి. వాళ్లు కమర్షియల్ కోణం పట్టించుకోరు. డబ్బులొస్తాయా,రావా? అనే లెక్కలేసుకోరు. అనుకొన్న కథని అనుకున్నట్టు నిజాయతీగా ఆవిష్కరిస్తారు. `గార్గి` అలాంటి ప్రయత్నమే. సాయి పల్లవి నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్.. సాయి పల్లవే. ఈ సినిమా ప్రచారాన్ని కూడా తనే భుజాలపై వేసుకొని నిర్వహించింది. ఈ సినిమా, అందులోని `గార్గి` పాత్ర.. తనకు అంతలా కనెక్ట్ అయ్యాయన్న మాట. ఏదో ఓ కొత్త కోణముంటే తప్ప.. సినిమాపై సంతకం చేయని సాయి పల్లవి… గార్గిని ఇంతలా మోసిందంటే.. విషయం ఉండే ఉంటుందన్న నమ్మకం కలుగుతుంది. ప్రచార చిత్రాలు చూసినప్పుడు అది మరింత ఎక్కువ అవుతుంది. మరి…. సాయి పల్లవి పై ప్రేక్షకులు పెట్టిన నమ్మకం మాటేంటి? `గార్గి` కథేమిటి?
గార్గి (సాయిపల్లవి) ఓ టీచర్. వాళ్లది సింపుల్ ఫ్యామిలీ. నాన్న.. ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్. తల్లి ఇంటి దగ్గర ఇడ్లీ, దోశ పిండి ఆడించి, అమ్ముతుంటుంది. గార్గికి పెళ్లి కూడా కుదురుతుంది. ఆ అబ్బాయిని గార్గి ఎంతగానే ఇష్టపడుతుంటుంది. అంతా ఓకే అనుకుంటున్న సందర్భంలో… ఓ రోజు వాళ్ల జీవితాలన్నీ మారిపోతాయి. గార్గి తండ్రి బ్రహ్మానందాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఓ మైనర్ బాలికపై రేప్ చేసిన నేరమిది. గార్గి కృంగిపోతుంది.. కంపించిపోతుంది. తన తండ్రి ఏపాపం ఎరుగడని తనకు తెలుసు. అరవై ఏళ్ల తన తండ్రి… ఎంత సౌమ్యుడో, ఆడపిల్లల పట్ల తనకెంత గౌరవమో… ఓ కూతురిగా తనకంటే ఎవరికి బాగా తెలుసు. పోలీసులు తన తండ్రిని అనవసరంగా ఈకేసులో ఇరికించారని అర్థమవుతుంది. ఎలాగైనా తన తండ్రిని బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే మైనర్ బాలికపై అత్యాచారం కేసు కాబట్టి.. లాయర్లెవరూ బ్రహ్మానందం తరపున కేసువాదించకూడదని బార్ కౌన్సిల్ ఆదేసిస్తుంది. ఇలాంటి పరిస్థితులో ఓ జూ.లాయర్ అయిన వీరేశం (కాళి వెంకట్) గార్గికి అండగా నిలబడతాడు. తనకా అనుభవం లేదు. పైగా నత్తి. కేసు అన్ని విధాలా బిగుసుకుని ఉంటుంది. ఇలాంటి సమయంలో… గార్గి తన తండ్రిని కాపాడుకోగలిగిందా, లేదా? అనేదే మిగిలిన కథ.
ఈ కథలో రెండు కోణాలున్నాయి. ఒకటి.. చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచార వైనాల్ని తెరపై తీసుకుని రావడం, రెండోది…. న్యాయస్థానాలు, పోలీసువ్యవస్థ పనితీరుని కళ్లకు కట్టడం. రెండూ సున్నితమైన విషయాలే. రెండింటినీ దర్శకుడు సమర్థంగానే డీలక్ చేశాడు. ప్రతీరోజూ.. బాలికలపై అత్యాచారం లాంటి వార్తలు వింటూనే ఉంటాం. ఆ కేసులో ఎవరో ఒకరు పట్టుబడతారు. వాళ్లని చూడగానే… ఆవేశం తన్నుకొని వస్తుంది. అయితే…. నిజంగానే వాళ్లే రేప్ చేశారా, లేదా? అనేది మాత్రం ఆలోచించం. నిందితుడి కుటుంబాన్ని కూడా.. నీచంగానే చూస్తుంటుంది లోకం. తప్పు ఒకరది.. శిక్ష ఇంకొకరికా? పైగా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా మీడియా చేసే అతి, సమాజం చూసే చూపులు, ఈ విషయాన్ని వాడుకొని – ఫేమ్‌లోకి వద్దామని చూసే రాజకీయ పార్టీలు… ఇలా జరిగింది ఒక రేపే. కానీ.. పరోక్షంగా ఎన్నో మానభంగాలు.
ఇదంతా ఒక ఎత్తు. అత్యాచారానికి గురైన బాధితురాలి దీన వేదన మరో వైపు. తనకూతుర్ని రేప్ చేస్తే.. ఓ తండ్రి పడే ఆవేదన ఏ స్థాయిలో ఉంటుంది? దాన్ని ఊహించలేం. ఈ సీన్ మనకు చాలా సినిమాల్లో కనిపించి ఉండొచ్చు. కానీ… `గార్గి`లో దర్శకుడు దాన్ని డీల్ చేసిన విధానం చూస్తే… హృదయం ద్రవించుకునిపోతుంది. `అప్పట్నుంచి నన్ను కూడా నా బిడ్డ మగాడిలానే చూసి, భయపడుతోందమ్మా` అని ఓ తండ్రి అంటుంటే.. ఎవరికైనా సరే, దుఖం ఉబికి వస్తుంది. తన కూతురి దేహంతో ఆడుకొన్నవాడ్ని చంపాలని కత్తిపట్టుకొని బయలుదేరతాడు తండ్రి. ఆ ఇంట్లోనూ.. తన కూతురి వయసున్న పాప కనిపించగానే.. తన కూతురు గుర్తొస్తుంది. వెంటనే ఆ అమ్మాయిని హత్తుకొని… ఏడ్చేస్తాడు. ఆ కత్తి పడేసి.. అక్కడ్నుంచి దీనంగా వెళ్లిపోతాడు. దాదాపు 2 నిమిషాల సీన్లో మాటలు లేవు.. కేవలం ఆకాశమంత, అగాథమంత భావోద్వేగమే.
కోర్టు ప్రొసిడింగ్స్ ఎలా జరుగుతాయో, అత్యంత సహజంగా తెరపై చూపించారు. ఓ ట్రాన్స్ జెండర్‌ని జడ్జ్‌గా చూపించడం ఇదే తొలిసారేమో..? ఆ ధైర్యానికి, ఆ ఆలోచనకు మెచ్చుకోవాలి. జడ్జ్ పాత్రని ఎంత సీనియస్‌గా, సిన్సియర్‌గా చూపించారంటే… ట్రాన్స్ జెండర్లపై గౌరవం కలిగేంత. ఓ సందర్భంలో జడ్జ్ మాట్లాడుతూ “ఓ ఆడదాని బాధని, ఓ మగాడిని పొగరుని నేను మాత్రమే అర్థం చేసుకోగలను… ఆ శక్తి నాకు మాత్రమే ఉంది“ అని చెప్పినప్పుడు – థియేటరంతా క్లాప్స్ పడతాడు. న్యాయస్థానంలో న్యాయం ఇంత నీతిమంతంగా, నిజాయతీగా నిలబడితే…. ఈ దేశానికి, బాధితులకు ఏం కావాలి? అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో ఇన్వెస్టిగేషన్ అంతా నడుస్తుంది. అక్కడ సినిమా బాగా నెమ్మదిస్తుంది. క్లైమాక్స్‌లో జరిగేది ఇదే కదా.? అనే దృష్టికోణంతో ప్రేక్షకుడు సినిమా చూస్తుంటాడు. చివర్లో అంతా అయిపోయింది లేచి వెళ్లిపోవడమే అనుకుంటున్న తరుణంలో.. ఓ షాక్. నిజంగా ఈ కథలో ఇలాంటి ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు. `మగాడెప్పటికైనా మగాడే. తనలోని మృగత్వం ఏ క్షణంలో అయినా, ఏ రూపంలో అయినా పడగ విప్పుతుంది` అనే మాటకు ఆ ట్విస్ట్ ఓ సాక్షంగా నిలుస్తుంది. అప్పటి వరకూ చూసిన కథ వేరు. అక్కడి నుంచి ఆ 5 నిమిషాలూ జరిగే కథ వేరు. ఈ కథ దృక్పథాన్ని, దృష్టి కోణాన్నీ పూర్తిగా మార్చేసే పాయింట్ అది. అదేంటన్నది తెరపై చూడాలి.
ఈ సినిమా ఆడవాళ్లకు, ఆడపిల్లలకు చెప్పే ఓ జాగ్రత్తలా చూడాలి. వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడులకు ఓ నమూనాగా భావించాలి. చివర్లో కొన్ని డైలాగులు.. ఆడపిల్లల తల్లిదండ్రుల్ని భయపెట్టేలా ఉన్నా, అవి వాస్తవాలు. కఠిన నిజాలు. `నా ఇంట్లోనూ ఓ ఆడపిల్ల ఉంది.. నన్ను కన్నదీ ఓ అడదే` అనే నిజం ఓ మగాడు తెలుసుకొనేంత వరకూ.. ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేదు.
సాయి పల్లవికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎక్కడా సాయి పల్లవి కనిపించలేదు. గార్గి తప్ప. ఓ తండ్రిని కాపాడుకొనే కూతురిగా తన ఆవేదన, ఆక్రందన, చేసే పోరాటం.. హృదయాన్ని గెలుచుకొన్నాయి. మరోసారి అత్యంత సహజమైన నటన ప్రదర్శించింది. ఈ యేడాది కొన్ని అవార్డులు సాయి పల్లవి ఇంటి అడ్రస్స్ వెదుక్కొంటూ వెళ్లడం ఖాయం. కాళి వెంకట్‌కి అద్భుతమైన పాత్ర దొరికింది. లాయర్‌గా.. తన నటన గుర్తుండిపోతుంది. జడ్జ్ గా నటించిన ట్రాన్స్ జెండర్ పాత్రధారి… ఆ ఠీవీని ప్రదర్శించారు. దర్శకుడు ఈ కథని ఎంత నిజాయతీగా రాసుకొన్నాడో, అంతే నిజాయతీగా తెరకెక్కించాడు. ఈ సమాజం, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు అవసరమైన సినిమా ఇది. మాట్లాడుకోవాల్సిన కథ ఇది. అక్కడక్కడ స్లో ఫేజ్ ఉంటుంది. బోర్ అనిపిస్తుంది. కాస్త ఓపిగ్గా చూస్తే… హృదయాన్ని కదిలించే సన్నివేశాల్ని, ఒళ్లు జలదరించే ట్విస్ట్ ని, సాయి పల్లవిలోని గొప్ప నటిని.. కళ్లారా చూపించే సినిమా ఇది.