తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిపోయింది. జిల్లాలకు జిల్లాలు ముంపులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి భవన్‌లోనే కేసీఆర్ వార్ రూం పెట్టారు. అయితే కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలపై ఇతరపార్టీల నేతలతో మంతనాలు జరుపుతూ బిజీగా ఉంటున్నారు. శుక్రవారం ఆయన పలువురు ఇతర రాష్ట్రాల సీఎంలకు ఫోన్లు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలతోనూ మాట్లాడారని టీఆర్ెస్ వర్గాలు ప్రకటించాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని.. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కేసీఆర్ వారిని కోరారని చెబుున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ.. పోరుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
విపక్ష పార్టీలన్నీ కలసి కట్టుగా ర్యాలీలు నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో కలిసి పోరాడటంతో పాటు బయట కూడా ర్యాలీలు నిర్వహించాలన్న ఆలోచన కేసీఆర్ వారి ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్త నిరసనలతో కేంద్రాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించాలని కేసీఆర్ అంటున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇతర పార్టీల స్పందనేమిటో టీఆర్ఎస్ వర్గాలుచెప్పలేదు. కేసీఆర్ మాత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారని.. విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు మంతనాలు కొనసాగుతున్నాయని ఇవి సత్ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు.